గద్వాల, జూన్ 16 : వైద్య సేవల కోసం సమైక్య రాష్ట్రంలో పడిన గోసకు చెక్ పెడుతూ స్వరాష్ట్రంలో అందరికీ అధునాతన వైద్యం చేరువవుతున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి జిల్లాలో మొదటగా పాలమూరు, ఆ తర్వాత వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు జిల్లా ప్రజలకు వైద్యం సరిగ్గా అందేది కాదు. ఏదైనా ప్రమాదం జరిగినా, అత్యవసర చికిత్సల కోసం కర్నూల్ లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో జిల్లా కేంద్రంలోని దవాఖానలో సకల వసతులు కల్పించింది. విద్యాపరంగా వెనుకబడిన జోగుళాంబ గద్వాల జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసింది.
ఈ విద్యాసంవత్సరం నుంచి కళాశాల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది వరకే జిల్లా మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్‌ను కేటాయించగా కళాశాల, దవాఖానలో పనిచేసేందుకు 7 ట్యూటర్, 22 సీనియర్ రెసిడెంట్ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసింది. అనాటమీ (2), ఫిజియాలజీ(2), బయోకెమిస్ట్రీ-1, ట్యూటర్ పోస్టులు, ఫార్మాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ పోస్టుకు ఒక్కొక్కరిని, రెండు జనరల్ మెడిసిన్, రెండు జనరల్ సర్జరీ, సైక్రియాటిస్ట్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్తమాలజీ, ఓబీజీ, అనెస్తిషియా, డీవీఎల్ సీనియర్ రెసిడెంట్‌గా ఒక్కొక్కరిని, రేడియో డ యాగ్నొస్టిక్కు ఇద్దరిని కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసింది. వీటితో పాటు 11మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ముగ్గురు ల్యాబ్ అసిస్టెంట్లు, 9 ఆఫీస్ స బార్టినేట్లు, థియేటర్ అసిస్టెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించి డిప్ పద్ధతిన పోస్టులను భర్తీ చే సింది. ఇక కళాశాల ప్రారంభమే మిగిలిపోయింది. గద్వాల జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను రద్దు చేస్తారని పనికట్టుకొని ప్రచారం చేసిన వాళ్లకు ప్రభుత్వం పోస్టుల భర్తీతో సమాధానం చెప్పింది.
స్వరాష్ట్రం సిద్ధించాక రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు గానూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా దవాఖానలో 100 నుంచి 300 పడకలకు పెంచారు. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా 57 పరీక్షలు చేస్తున్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం రోగులకు అందుతున్న 57 పరీక్షలను కలుపుకొని మొత్తం 134 పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ ద వాఖానలో ఎన్నిరకాల టెస్ట్‌లు చేస్తారో అవన్నీ తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో ఉచితంగా చేయడమే కాకుండా 24గంటల్లో ఫలితాలు ఇవ్వనున్నారు. రెం డేండ్ల కింద కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేసింది. కాగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలో కళాశాల విజయవంతంగా కొనసాగుతున్నది. రోగులకు చికిత్స అనంతరం అవసరమైన మందులు అందించడానికి ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను సైతం మంజూరు చేసింది. ప్రస్తుతం యువకులు ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తుండడంతో దానిని అడ్డుకునేందుకు జిల్లా దవాఖానలో టినెక్ట్ప్లాస్ టీకాను అందుబాటులో ఉంచింది. వెనుకబడిన జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గద్వాలకు మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో జిల్లా వైద్యపరంగా అభివృద్ధి చెందనున్నది. ప్రస్తుతం ఉన్న దవాఖాన సూపర్ స్పెషాలిటీ జనరల్ దవాఖానగా మారే అవకాశం ఉన్నది. అదేవిధంగా జిల్లా దవాఖానలో వైద్యుల కొరత తీరి అధునాతన ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.
ఈ అకాడమిక్‌లో మెడికల్ కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉ న్నది. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారుల ను ఆదేశించాం. వెనుకబడిన గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూ రు చేయించి, పేదలకు అధునాతన వైద్యం అందించాలన్న నా కోరిక తీరింది. ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి మెడికల్ కళాశాల మంజూరు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు చేయగా తరగతులు ప్రారంభమయ్యాయి. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం వైద్య హబ్‌గా మారనున్నది. ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కళాశాలకు అవసరమైన ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించి భర్తీ చేయడం సంతోషంగా ఉన్నది. – బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల
జోగుళాంబ గద్వాల విద్యార్థులకు 20 24-25 విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాల అందుబాటులోకి రానున్నది. ఒ క్కో కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా సీట్ల సంఖ్యపై కొంత స్పష్టత రావాల్సి ఉన్నది. కొత్త కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, పడకల సంఖ్యను జాతీయ మెడికల్ కమిషన్ పరిశీలించాల్సి ఉంది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి రావాలంటే ప్రతి కళాశాలలో 21 స్పెషలైజేష న్ విభాగాలు ఉండాలి. పడకల ఆక్యుపెన్సీ ఏటా కనీసం 80శాతం ఉండాలి. 50 సీట్లకు 220 పడకలు, 100సీట్లకు 420 పడకలు ఉండాలి. దీనిని బట్టి కళాశాలకు సీట్ల కేటాయింపు చేస్తారు.