నాగర్‌కర్నూల్, మార్చి 14: ప్రజల తరఫున శాసన సభలో ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం అవివేకమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, జర్నలిస్టులపై కేసులు పెడుతూ ప్రశ్నించే గొంతులను నొక్కాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే గురువారం ఘటన చీకటి రోజు అని, కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతుకోసిందన్నారు.
అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు చేయడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే జగదీశ్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకు సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలం, హన్మంత్‌రావు, రమణతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.