గద్వాల, జూన్ 17 : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన బడులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ బడుల్లోనే చదువు బాగా చెబుతారనే నమ్మకం ఉండేది. ఎందుకంటే అక్కడ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారు.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తారనే విశ్వాసం బలంగా ఉండేది. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలు రంగురంగుల బ్రోచర్లు ముద్రించి తమ పాఠశాలల వైపు విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇంగ్లిష్ మీడియంలో బోధనకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు పెంచి సామాన్యుడి నడ్డి విరిచే పనిలో పడ్డాయి. ఈక్రమంలో ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌కు దీటుగా అన్ని వర్గాల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం మన ఊరు-మనబడికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంతోపాటు ఎమ్మెల్యే, ఎంపీపీ నిధులతో గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం చాగదోణ పాఠశాల నియోజకవర్గానికే ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాలలో కల్పించిన వసతులు, సౌకర్యాలపై నమస్తే ప్రత్యేక కథనం.
చాగదోణ గ్రామంలో ఒకే ఆవరణలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలున్నాయి. అక్కడే అన్ని వసతులతో అంగన్వాడీ భవనాన్ని కూడా నిర్మించారు. అంగన్వాడీలో చిన్నారుల కోసం స్పోర్ట్స్ మెటీరియల్‌ను ఎంపీపీ నిధుల నుంచి రూ.3లక్షలతో సమకూర్చారు. హైస్కూల్లో 248మంది, ప్రైమరీ స్కూల్లో 290మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు పాఠశాలలు, అంగన్వాడీ ఒకే ఆవరణలో ఉండడంతో దీనికి ప్రొఫెసర్ జయశంకర్ విద్యాప్రాంగణమని పేరు పెట్టగా.. పూర్వవిద్యార్థులు పాఠశాల ఆవరణలో సర్వేపల్లి రాధాకృష్ణ
విగ్రహం ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాఠశాలకు బెంచీలు కూడా అందజేశారు. పాఠశాల మొత్తంగా 84 ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. జెడ్పీహెచ్ఎస్లో మరమ్మతుల కోసం రూ.26లక్షలు, ప్రైమరీ స్కూల్ కోసం రూ.5.30లక్షలతో పనులు చేపట్టగా.. ఎమ్మెల్యే నిధులు రూ.5లక్షలతో ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో గ్రీనరీకి ఫినిషింగ్ ఏర్పాటు, ఎమ్మెల్యే నిధులు రూ.10లక్షలతో సీసీలతోపాటు పాత్వే నిర్మించారు. ఉపాధి హామీ నిధులతో టాయిలెట్స్ నిర్మించి.. పాఠశాల ఎదుట అందరినీ ఆకట్టుకునేలా స్టీల్ ఫాంట్‌తో నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇలా కార్పొరేట్‌ను తలపించేలా సర్కారు పాఠశాలను ఎంపీపీ విజయ్‌కుమార్ చొరవతో సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం
ప్రభుత్వం మన ఊరు-మన బడి కింద పాఠశాలను అభివృద్ధి చేస్తుండగా.. ఎమ్మెల్యే, ఎంపీపీ నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పించి సుందరంగా తీర్చిదిద్దాం. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయిలో విద్యను అందించడానికి అవకాశం లభించింది. విద్యార్థులకు మంచి చేయాలనే ఆలోచనతో పాఠశాలను కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేశాం. – విజయ్‌కుమార్, గట్టు ఎంపీపీ