మహబూబ్ నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు నరికి కొమ్మలు కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా కావడంతో వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రిచ్ బ్రెయిన్స్ స్కూల్ వద్ధ జరిగింది. వివరాల్లోకి వెళ్తే..టంకర గ్రామానికి చెందిన దాసు (42) గత వారం పది రోజులుగా విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది సూచనల మేరకు మహబూబ్ నగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లు, కొమ్మలు కొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మహబూబ్ నగర్ పట్టణం రాంమందిర్ సమీపంలో విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు, కొమ్మలు కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు సరఫరా కావడంతో అతను దుర్మరణం పాలయ్యారు.
ఈ విషయంపై విద్యుత్తుశాఖ అధికారులు స్పందిస్తూ తాము విద్యుత్తు సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండొద్దనే లక్ష్యంతోనే ట్రీకటింగ్ కార్యక్రమాన్ని పట్టణంలో 15 రోజులుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాంమందిర్ వద్ద ఓ వ్యక్తి ఇంటి ఎదుట స్తంభం పక్కనే చెట్టు ఉండటంతో ఎల్సీ తీసుకుని చెట్టు, కొమ్మలు కొట్టిస్తున్నామన్నారు. ఇంట్లో ఉన్న ఇన్వర్టర్కు ఎర్తింగ్ లేకపోవడంతో విద్యుత్తు రిటర్న్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ వన్ టౌన్ సీఐ అప్పయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.