చర్ల, మార్చి 15: చర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లలో నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. యాసంగి పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి దాపురించింది. రెండో పంట ఎకువగా మోటార్లపైనే ఆధారపడి ఉంటుంది. అయితే డబ్బు సంపాదన ధ్యేయంగా పాలకులు ఈ ప్రాంతంలో ఇసుక ర్యాంపులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారు.
గోదావరి తీర ప్రాంతం చర్ల మండలంలోనే సుమారు 12 ఇసుక క్వారీలు ఉన్నాయి. దీంతో ఆయా ఇసుక ర్యాంపుల్లో లక్షల క్యూబికుల ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. ఈ కారణంగా భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో బోరు మోటార్లలో నీళ్లు రాకపోవడంతో ఎండుతున్న పంటలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్ల మండలంలో గోదావరి తీర గ్రామాల్లో సుమారు 15వందల ఎకరాల సాగవుతున్నది. ఆ పంటలను కాపాడుకునేందుకు రైతులు ఏమిచేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు.