జడ్చర్ల టౌన్, మార్చి 23 : ‘తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతోపాటు అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసింది.. కానీ రెండేండ్ల కాలంలోనే కాంగ్రెస్ సర్కారు తెచ్చిన రూ.3.50 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు.. పైసలన్నీ ఎక్కడికి పో యాయి.. సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలి’.. అని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పులతో ఏం చేశారో ప్రజలు ఆలోచన చేయాలి,.. దీనిపై గ్రామగ్రామాన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
సోమవారం జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రెండేండ్ల కాలంలో ఫ్రీ బస్సు తప్పా మిగతా ఏ ఒక్క హామీ నేరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడో సారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనైనా ఏమో చేస్తారని ప్రజలు ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ చూస్తే ప్రజల నెత్తిన గుండు వేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసింది శూన్యమేనని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే స్కీంలు.. స్కాంలు.. డబ్బులన్నీ ఢీల్లీకి పం పించటమని చెప్పారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, పట్టాదారుతోపాటు కౌలుదారు రైతుకు రైతుబంధు ఇస్తామన్న ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 సార్లు రైతుబంధు ఎగొట్టారన్నారు. కాంగ్రెస్ పాలనలో సరైన కరెంట్, సాగు నీళ్లు లేక, ఎరువులు దొరక్క.. పంటలు ఎండిపోయి రైతులు రోడ్ల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాం..రాం..దళితబంధుకు జై..భీం అని అనాడు కేసీఆర్ చెప్పినట్లుగానే ఇప్పుడు చూస్తున్నామన్నారు.
మాయమాటలతో ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను నేరవేర్చటం చేతగాక అబద్ధపు మాటలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతకు 2 లక్షలు ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ రెండున్నర ఏండ్లలో కేవలం 11వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియమాకపత్రాలను ఇచ్చి ఉద్యోగాలిచ్చామంటూ హంగామా చేసుకుంటున్నదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సైతం కాంగ్రెస్ సర్కా రు మోసం చేసి పంగనామాలు పెట్టిందన్నారు.
ఆరు గ్యారెంటీలు వందరోజుల్లో నేరవేర్చుతామని ఇంటింటికీ హామీల కార్డులిచ్చి, సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీల చేత హామీలు ఇప్పించి నేటికీ వేయి రోజులైనా హామీలను నేరవేర్చలేకపోతున్నదన్నారు. గ్రామాల్లో కనీసం మిషన్ భగీరథ నీటి సరఫరా చేయలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొం దన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఏదైనా సమస్య వస్తే అధికారులు స్పందించే వారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏ అధికారి పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఇంతటి అవినీతి, ఆరాచక పాలన ఎన్నడూ చూడలేదని.. కాం గ్రెస్ ప్రభుత్వానికి ఆదాయం ఎలా సమకూర్చు కోవాలో పరిపాలన ఏ విధంగా చేయాలో చేతగావటంలేదన్నా రు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రం దివాలా తీయటం ఖాయం అన్నారు.
కాంగ్రెస్ వచ్చినంక సక్కగా కరెంట్ వస్తలేదు.. పంటలు ఎండిపోతున్నాయి.. రైతులం అవస్థలు పడుతున్నామంటూ జడ్చర్లకు చెందిన రాములు అనే రైతు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే.. 24 గంటలు కరెంట్ వచ్చేది.. ఇప్పుడేమో కరెంట్ ఎ ప్పుడొస్తదో..? ఎప్పుడు పోతదో? తెలియటం లేదు. కరెంటోళ్లూ పట్టించుకోవటంలేదని వాపోయారు. రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి మీరైనా తీసుకెళ్లండంటూ లక్ష్మారెడ్డిని కోరారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తిమ్మాజిపేట మం డలం ఆవంచ శివారులో ఉన్న 25 అడుగుల ఏకశిల వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి భక్తులు తరలివస్తుంటారన్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గానూ ఆలయం నిర్మాణానికి ఆలోచన చేస్తున్నామని, నిపుణులతో చర్చలు చేస్తున్నామన్నారు. వినాయక విగ్ర హం ఆలయం చుట్టూ 32 ఆలయాలు నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. అందరి సహకారంతో ఆలయ నిర్మాణానికి తాను స్వయంగా ముందుకొచ్చినట్లు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.