గద్వాల, డిసెంబర్ 15 : జోగుళాంబ గద్వాల జిల్లాలో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో నేతల కనుసన్నల్లో కబ్జాకోరులు బరి తెగిస్తున్నారు. చెరువులు, 10శాతం లేఅవుట్ స్థలాలు, మున్సిపాలిటీలో ఉన్న డ్రైనేజీలు కబ్జా చేసి వెంచర్లు, దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మేస్తున్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలో ఉన్నా ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వీటిపై ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇప్పుడే మా దృష్టికి వచ్చింది విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకుంటుండడంతో జిల్లా కేంద్రంలో కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను కబ్జాకోరులు కొట్టేస్తున్నారు. వీరికి అధికారపార్టీ నాయకుల అండ ఉండడంతో వారి పని కానిస్తున్నారు. అధికారులకు అన్ని తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో పాలకేంద్రం సమీపంలో కొందరు రోడ్డు వేసుకొని ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా మున్సిపల్ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్కెట్ యార్డు సమీపంలో మున్సిపాలిటీకి చెందిన 20 ఫీట్ల డ్రైన్‌ను కబ్జాదారులు ఆక్రమించి 10 ఫీట్లకు కుదించి నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులు, పాలకమండలి, కలెక్టర్‌కు తెలియడం లేదంటే ఇక్కడి స్థలాలు ఆక్రమణదారులు ఏరీతిలో కబ్జాలు చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. డ్రైనేజీ నిర్మాణం కూడా మున్సిపల్, మార్కెట్ యార్డు అధికారులకు తెలియడం లేదని చెబుతున్నారంటే పలు అనుమానాలకు తావిస్తున్నది.
జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారిలో 1972లో 62.28ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ యార్డు నిర్మించారు. అప్పుడు మార్కెట్ నుంచి మిల్లులకు ధా న్యాన్ని తరలించడానికి మార్కెట్ యార్డు పక్కన బండ్ల బాట 20 ఫీట్ల రోడ్డు ఉంది. దాని సమీపంలో డ్రైనేజీ ఏ ర్పాటు చేశారు. గద్వాల పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందడం డ్రైనేజీ సమీపంలో బీటీరోడ్డు ఏర్పాటు చేశారు. అయితే మార్కెట్ యార్డు ఆవరణలో కమీషన్ ఏజెంట్లు దుకాణాలు, ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు.
వీరి ఇండ్ల, దుకాణ సముదాయం వెనుక భాగంలో బండ్లబాటతో పాటు దాని పక్కనే డ్రైన్ నిర్మాణం ఏర్పాటు చేశారు. అయితే గతంలో మార్కెట్ యార్డు కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు ఎవరికీ తెలియకుండా కమీషన్ ఏజెంట్ల దుకాణాల వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని వారికి విక్రయించినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన మా ర్కెట్ యార్డులోని 26మంది కమీషన్ దారులు చింతలపేటకు వెళ్లే దారిలో ఉన్న 20 ఫీట్ల డ్రైన్‌ను మార్కెట్‌యా ర్డు అధికారులు, మున్సిపల్ అధికారులకు తెలియకుం డా 10 ఫీట్లకు కుదించి డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టా రు. ఈ నిర్మాణం తర్వాత దుకాణాలు, ఇండ్ల వెనుక భా గంలో ఉన్న స్థలాన్ని, డ్రైన్ స్థలాన్ని కలుపుకొని ప్రధాన రహదారి వైపు డ్రైన్‌పై దుకాణాలు నిర్మించడానికి కమీషన్ ఏజెంట్లు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
పనులు చేపట్టి 6నెలలు కావస్తున్నా జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులకు ఈ నిర్మాణ విషయం తెలియకపోవడం కొసమెరుపు. మున్సిపాలిటీలో ఎవరైనా పేదవాడు చిన్నపాటి స్థలాన్ని ఆక్రమించి ఇంటి ని ర్మాణం చేపడితే గద్దల్లా వాలే అధికారులు ఇంత పబ్లిక్‌గా మున్సిపల్ పాలక మండలి, అధికారులకు తెలియకుండా డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నారంటే ఇది అధికారులు, పాలకుల వైఫల్యంగా ప్రజలు చర్చించకుంటున్నా రు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరి అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా మున్సిపల్ స్థలం కబా ్జ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అంతా అయిపోయిన తర్వాత మార్కెట్ అధికారులు మార్కెట్ గోడ కూల్చకుండా ఉం డాలని నోటీసులిచ్చారు. కబ్జాల పర్వం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు విజయ్‌కుమార్ కబ్జాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు లిఖిత పూ ర్వకంగా ఫిర్యాదు చేశారు.
వడ్డించేవాడు మనోడైతే ఏ మూలన కూర్చున్న భోజనం మొదట మనకే వస్తది అనే సామేత ఇక్కడి కబ్జాకోరులకు వర్తిస్తుంది. అధికారులు , పాలకులతో కుమ్మకై జిల్లాకేంద్రంలో అనేక ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని స్థలాలు వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు.