నాగర్‌కర్నూల్, ఆగస్టు 24 : ఒక ప్రజాప్రతినిధి ఏదైనా పని చేయమని అడిగితే దానిని బాధ్యతతో సాధించి పెడి తే ఆ సమయానికి గుర్తు చేసుకొని మరిచిపోతున్న ఈ రోజుల్లో తన హయాంలో చేపట్టిన ఓ భారీ వంతెన నిర్మాణాన్ని గుర్తు చేసుకొని ఆ నిర్మాణాన్ని సాధించిన ప్రజాప్రతినిధిని, అందుకు సహకరించిన నేత చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ సంబురపడిన ముచ్చట తెలకపల్లి మండలం నడిగడ్డలో ఆదివారం చో టుచేసుకున్నది. తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామ సమీ పం నుంచి దుందుభీవాగు ప్రవహిస్తూ ఉంటుంది.
అయి తే ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నడిగడ్డ గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఎందరో నాయకులకు మొరపెట్టుకున్నారు. ఏండ్ల తరబడిగా ఉన్న సమస్యను ఏ నాయకుడు కూడా తీర్చలేకపోయాడు. కానీ నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి నడిగడ్డ ప్రజల్లో సంబురాన్ని చూసే అవకాశం, వారి నుంచి కృతజ్ఞతలు అందుకొనే సందర్భం వచ్చింది. రోడ్డుపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రతి ఏడాది వర్షాకాలంలో ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చిన్నపాటి వర్షం వచ్చినా వరద పారుతుండడంతో నడిగడ్డ ప్రజలకు రాకపోకలు నిలిచిపోయేవి.
ఈ సమస్యలను నడిగడ్డ గ్రామ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సారథ్యంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. బ్రిడ్జి లేకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. దీంతో స్పందించిన మర్రి కేసీఆర్ సహకారంతో నడిగడ్డ వాగుపై బ్రిడి నిర్మానానికి రూ.3 కోట్ల 20 లక్షలు మం జూరు చేయించి వంతెన నిర్మాణం జరిగేలా కృషి చేశారు. నడిగడ్డ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కల నిజమైంది. వంతెన నిర్మాణం పూర్తవడం ద్వారా ప్రజల నిత్యజీవన కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది.
వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటే ప్రతి అడుగులో భయం, పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఎదురైన అడ్డంకులు, రైతులు పొలాలకు చేరుకోవడంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నీ తీరాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వంతెన నిర్మాణానికి కృషిచేయడంతో చరిత్రలో నిలిచిపోయిందని నడిగడ్డ ప్రజల సంబురానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ వంతెనతో నడిగడ్డ ప్రజల జీవితంలో ఓ కొత్త దశ ఆరంభమైందని, ఎన్నో ఏండ్ల కష్టాలకు ముగింపు పడిందని గుర్తు చేసుకుంటూ కేసీఆర్, మర్రి జనార్దన్‌రెడ్డిల చిత్ర పటాలకు ఆదివారం వంతెనపైనే క్షీరాభిషేకం చేస్తూ సంబురపడ్డారు. వంతెన నిర్మా ణం మర్రి జనార్దన్‌రెడ్డి పట్టుదలకు నిదర్శమని, వంతెన నిర్మాణానికి కృషి చేసిన మర్రికి నడిగడ్డ ప్రజలు తరతరాలపాటు గుర్తుంచుకుంటారని కృతజ్ఞతలు తెలిపారు.