గద్వాల, జనవరి 23 : కేసీఆర్ పాలనలో నడిగడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. బీఆర్ఎస్ ఏర్పాటు మొదలు, రాష్ట్రం సాధించే వరకు నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ పాదయాత్రలో తెలుసుకొని తెలంగాణ ఏర్పాటు తర్వాత విడుతల వారీగా తీర్చడంతో జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టింది. వలస ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం బీఆర్ఎస్ పుణ్యమా అని రివర్స్ వలసలు ప్రారంభమయ్యాయి. నూతన జిల్లాగా ఏర్పడగా.. నడిగడ్డ రూపురేఖలే మారిపోయాయి. కానీ కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి’ అక్కడే అన్న చందంగా మారిపోయింది. సాగైన పంటలకు నీళ్లు అందక.. దిగుబడి లేక పంటలు ఎండి మరింత అప్పులు పాలవుతున్నారు. రైతుభరోసా అందక రైతులు అరిగోస పడ్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుతో నవశకానికి నాంది పలికింది. ప్రజలకు చేరువలో పాలన వచ్చి పనుల్లో పారదర్శకత నెలకొన్నది. అభివృద్ధి వైపు అడుగులు పడ్డాయి. చిన్న జిల్లా కావడం.. సుమారు 53 శాఖల అధికారులు, ప్రజలకు 50 కి.మీ. దూరంలో ఉండడంతో ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులకు విన్నవించుకునే అవకాశం దక్కింది. నాడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే దక్కాయి. వివిధ శాఖల్లో అవినీతి తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విద్యా, వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందడానికి వీలు ఏర్పడింది. ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అనువుగా మారింది.
సాగునీరు పుష్కలంగా ఉన్న గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని రైతులు ఎక్కువగా కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి సరైన మార్కెట్ వసతులు లేక.. ధర వచ్చినా రాకున్నా రైతులు, దళారులకు అమ్ముకొని వెళ్తున్నారు. ఇది గ్రహించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూరగాయలను నేరుగా అమ్ముకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరాయి. నాలుగు బ్లాక్‌ల్లో నిర్మిస్తుండగా.. రెండు బ్లాక్‌లు పూర్తయ్యాయి. ఒక్కో బ్లాక్‌లో వెజిటేబుల్, సూపర్‌మార్కెట్, చేపల మార్కెట్, ఫుడ్‌కోర్టు, పూలు, పండ్ల దుకాణాలు నిర్మిస్తున్నారు. పనులు పూర్తయితే ప్రజలకు అన్నీ ఒకే చోట దొరికే అవకాశం ఉండగా.. రైతులకు మేలు చేకూరనున్నది.
గద్వాల జిల్లాల ఏర్పాటుతో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించింది. వంద పడకల దవాఖానను 300 పడకలకు పెంచా రు. అధునాతన సౌకర్యాలతో నిర్మాణ పనులు పూర్తి కాగా మెడికల్ కళాశాల తరగతులు నిర్వహిస్తున్నారు. అందుబాటులోకి వస్తే కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు వైద్యం అందనున్నది. కేసీఆర్ హ యాంలో జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేశారు. ప్రస్తుతం నర్సింగ్ తరగతులు కొనసాగుతున్నాయి. డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటవగా.. 134 రోగ నిర్ధారణకు సంబంధించి ఉచిత పరీక్షలు చేస్తున్నారు. గతంలో ఉన్న మందుల కొరత సెంట్రల్ మెడికల్ స్టోర్ మంజూరు కావడంతో తీరింది. ఐసీయూ, డయాలిసిస్, రేడియాలజీ, సిటీ స్కాన్, ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఏవైనా సమావేశాలు, విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు జరపాలంటే సరైన సౌకర్యాలు గతంలో ఉండేవి కావు. దీంతో నాడు నల్లకుంటలో మల్టీపర్పస్తో ఇండోర్ ఆడిటోరియం రూ.6.25 కోట్లతో చేపట్టగా.. పనులు వేగంగా జరుతున్నాయి. ఇండోర్ గేమ్స్‌తోపాటు ఇతర పోగ్రామ్స్ ప్రభుత్వ, ప్రజలకు ఉపయోగ పడేలా గత ప్రభుత్వం పనులు ప్రారంభించింది.
రూ.11.90 కోట్లతో సెంట్రల్ లైటింగ్‌తోపాటు మల వ్యర్థాల శుద్ధి కేంద్రం, రెండు వైకుంఠధామాలు, ఎల్పీజీ డబుల్ సిలిండర్ బర్నింగ్ క్రిమిటోరియం, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, 39 స్ట్రీట్ వెండింగ్ షాప్స్, 15 పబ్లిక్ టాయిలెట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డంప్ యార్డు నిర్మాణం.. ప్రతి వార్డులో పట్టణ ప్రకృతి వనాలు, ఓపెన్ జిమ్‌లు, స్మృతి వనం, సంగాల చెన్నకేశవ పార్కు ఏర్పాటు చేశారు. నాటి సీఎం కేసీఆర్ రూ.56 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. జూరాల వద్ద పర్యాటకుల కోసం రూ.15 కోట్లతో బృందావన్ గార్డెన్ సైతం నిర్మిస్తున్నారు.
పీజీ కళాశాల జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో కళాశాలలో చేరిన విద్యార్థులకు.. ఎక్కువగా యువతులు ఉండగా.. వసతి గృహం లేక ఇక్కట్లు పడేవారు. మరికొందరైతే ఇక్కడ చేరడానికి ఇష్టపడేవారు కాదు. గ్రహించిన కేసీఆర్ వసతి గృహాల నిర్మాణాకు రూ.10 కోట్లు మంజూరు చేయగా.. రెండు వసతి గృహాలు అధునాతంగా నిర్మించారు. నూతన కళాశాల, జూనియర్ కళాశాల భవనాలు రూ.1.50 కోట్లతో నిర్మించారు. డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు రూ.80 లక్షలతో చేపట్టారు.
జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ చిన్నగా ఉండడంతోపాటు శిథిలావస్థకు చేరింది. దీంతో నూతన బస్ స్టేషన్ నిర్మించారు. పాత బస్టాండ్‌ను కూల్చి ఆ స్థానంలో 15 ప్లాట్‌ఫాంలతో రూ.6 కోట్లతో చేపట్టారు. పాస్ కౌంటర్, కంప్యూటర్, సేద తీరడానికి గదులు నిర్మించారు. సంగాల రిజర్వాయర్ వద్ద పార్కు నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
జిల్లా ప్రజలకు చేరువలో అధునాతన సౌకర్యాలతో.. అన్ని శాఖలు ఒకే చోట ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు వారి సమస్యలు త్వరగా పరిష్కారం కావడానికి సమీకృత కలెక్టరేట్ నిర్మాణం నిర్మించారు. అలాగే ఎస్పీ కార్యాలయ భవనం ఆధునాతనంగా నిర్మించారు. రెండు అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు ప్రభుత్వం ప్రాముఖ్యతనిచ్చింది. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వ్యవసాయ విస్తరణ అధికారులను గత ప్రభుత్వం నియమించడంతో పాటు రైతువేదికలు ఏర్పాటు చేసింది. రైతుబంధు పథకం కింద జిల్లాలో గత సర్కారు 1,56,282 మంది రైతుల ఖాతాల్లో రూ. 224 కోట్లు జమ చేసింది. రైతు బీమా ద్వారా 2,467 కుటుంబాలకు రూ.123.35 కోట్ల పరిహారం అందింది. ఉద్యానవ శాఖ ద్వారా స్ప్రింక్లర్ల సేద్యం కోసం రూ.1,206 లక్షల వ్యయంతో 1,417 మంది రైతులు లబ్ధి పొందారు. ఐఎఫ్‌డీఎస్ పథకంలో మ త్స్య కారులకు రూ.10 కోట్లతో వలలు, తెప్పలు, ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు 100 శాతం సబ్సిడీతో అందజేశారు. చేనేత మిత్ర పథకం కింద 5,826 మంది కార్మికులు, అనుబంధ కార్మికులకు రూ.5.92 కోట్ల నూలు సబ్సిడీ వారి ఖాతాల్లో జమ చేశారు.
ప్రాజెక్టుల రాకతో సస్యశ్యామలం గద్వాల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రూ.581 కోట్లతో గట్టు ఎత్తిపోతల పనులు చకచకా సాగుతున్నా యి. దీనికి తోడు జిల్లాలో 48,254 మంది వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను గత ప్రభుత్వం అందించింది. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రూ.84.16 కోట్లు ఖర్చు చేసింది. రూ.2 కోట్లతో విద్యుత్ ఎస్ఈ కార్యాలయం నిర్మించారు.
ప్రజల నీటి దాహార్తిని తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.700 కోట్లతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 311 ఆవాసాలు, నాలుగు మున్సిపాల్టీలలో శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నది. జిల్లాలో 334 కొత్త ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. 1388.95 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి 1,37,959 నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటి సమస్య లేకుండా చేశారు. 1300 డబుల్ బెడ్రూం ఇండ్లు రూ.68.90 కోట్లతో నిర్మించారు. 715 ఇండ్లు రెడీ కాగా లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన పనులు జరుగుతున్నాయి.
జిల్లాలో తొమ్మిది బ్రిడ్జి పనుల కు రూ.46 కోట్లు మంజూరవగా.. రూ.47.15 కోట్లతో 8 రోడ్డు పనులు పూర్తి చేశా రు. జెడ్పీ నిధుల నుంచి రూ.4 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో రూ.25 కోట్లతో ఆర్వోబీని నిర్మించింది. ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ చొరవతో గద్వాల జిల్లా అభివృద్ధి వైపు అడుగులు వేసింది.
అలంపూర్‌కు వంద పడకల దవాఖాన మంజూరూ అందుబాటులోకి రావడంతో ప్రజ లు సంతోష పడ్డారు. అయిజ వైద్యశాల స్థాయిని 30 పడకలకు పెంచారు. ఐసీయూ, డయాలిసిస్ సెంటర్లు అందుబాటులోకి తేవడంతో రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది. రూ.384 కోట్లు ఖర్చు చేసి తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి చేయగా ప్రస్తుతం 50 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరు అందడంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేస్తున్నారు. అలంపూర్, వడ్డేపల్లి, అయిజ ఒక్కో మున్సిపాలిటీలో రూ.10 కోట్లతో డివైడర్ల ఏర్పాట్లతోపాటు సెంట్రల్ లైటింగ్, వార్డుల్లో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ప్రతి పల్లెకూ తారురోడ్డు వేశారు. తుంగభద్ర నదిపై రూ.35 కోట్లతో అలంపూర్-ర్యాలంపాడ్ మధ్య వంతెన నిర్మించారు. రాజోళి మండలం మాన్‌దొడ్డి పల్లెప్రగతి అభివృద్ధి పనులకు, పేదరిక నిర్మూలనలో కేంద్రం నుంచి అవార్డు అందుకున్నది. ఇదంతా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుణ్యంగా నడిగడ్డ ప్రజలు భావిస్తారు.