మహబూబ్‌నగర్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేస్తున్న తీవ్ర అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పాలమూరు జిల్లా కరువును పోగొట్టాలని పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొస్తే ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదని కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరుగుతు న్న అన్యాయంపై గళమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు తలొగ్గి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాను అన్యాయానికి గురిచేస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ రాకముందు వచ్చాక పాలమూ రు పరిస్థితులపై కేసీఆర్ కులంకషంగా చర్చించారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను బహిర్గతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తిచేస్తే ఎక్కడ కేసీఆర్‌కు పేరు వస్తుందోనన్న రే వంత్ కుట్రలను బహిర్గతం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కృష్ణానది జలాలపై త్వరలో పోరాటం ప్రారంభమవుతుందని.. పాలమూరు జిల్లాకు న్యాయం చేసే వరకు ఆగేదే లేదన్నారు.
పాలమూరు జిల్లా కరువు కోరల్లో చిక్కుకోవడానికి ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులే కారణమని కేసీఆర్ పూసగుచ్చినట్లు వివరించారు. కృష్ణానది 350 కిలోమీటర్లు పారుతున్న ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులకు కలిపి కేవలం 30వేల ఎకరాలు కూడా పారించలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు కూడా జిల్లాలు దత్తత తీసుకొని చేసింది ఏ మిలేదని మండిపడ్డారు.
దీంతో పాలమూరు జిల్లా ప్రజలు వలసలకు అలవాటు పడి తట్టబుట్ట సర్దుకుని బొంబాయికి వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి బొంబాయికి బస్సు లు ఉం డేవని అవన్నీ కిటకిటలాడుతుండేవని జిల్లాలను వలస జిల్లాగా మార్చాయన్నారు. ఎంత కరువు ఉం దంటే ఎండాకాలంలో గంజి కేంద్రాలు పెట్టి ఇక్కడున్న ముసలి ముతకను కాపాడుకునేందుకు నానా తంటాలు పడే పరిస్థితులు తలెత్తనీయన న్నారు. జూరాల ప్రాజెక్టు, ఆర్డీఎస్ మిగతా పెం డింగ్ ప్రాజెక్టుల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఒరిగి ఏదీ లేదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా కరువును చూసి కన్నీళ్లు పెట్టుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. ఎక్కడికి వెళ్లినా గ్రామాలన్నీ ఖాళీగా కనపడేవని.. జీవ నదులైన కృష్ణా, తుంగభద్ర పారుతు న్నా పాలమూరు జిల్లాకు ప్రయోజనమే లేకుండా పోయిందన్నారు. అందుకే ఆర్డీఎస్‌పై పాదయాత్ర చేపట్టామన్నారు. 80వేల ఎకరాలకు నీరు అందించే ఆర్డీఎస్ను పడావు పెట్టి ఆంధ్ర పాలకులు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మేం చేసిన పోరాట ఫలితంగా కర్ణాటకలో ఉన్న ఆర్డీఎస్ ప్రధాన రెగ్యులేటరీ వద్ద పనులకు చేయడానికి అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఒప్పుకుందన్నారు. అయితే ఇదే చంద్రబాబు నాయుడు హయాంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్డీఎస్ తూములను బద్దలు కొట్టారని దీనిపై అనేక పోరాటాలు చేశామన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తూనే పాలమూరు అన్యాయంపై గళమెత్త్తమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక పాలమూరు జిల్లా కరువును రూపుమాపేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి సాగునీరు అందించామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6.30లక్షల ఎకరాలకు నీరు అందించి ఊరట కలిగించామన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వల్ల జిల్లా రూపురేఖలను కొద్దికొద్దిగా మార్చుతూ వచ్చామన్నారు.
కృష్ణానదిలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ర్టానికి రావలసిన పూర్తి వాటర్ దక్కించుకునేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకానికి అప్పట్లో అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి సుమారు 95టీఎంసీల నీటిని కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నప్పటికీ అన్ని అడ్డంకులను దాటుకొని ఈ ప్రాజెక్టుకు దాదాపు 80శాతం పూర్తి చేశామన్నారు. 2023లో తొలిదశ పనులను కూడా ప్రారంభించుకున్నామన్నారు. ఇంత చేసినా అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రెండేళ్లయిన ఈ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. మళ్లీ కరువు కోరల్లో తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి దాదాపు 95 టీఎంసీల నికరజలాలు వాడుకునే విధంగా చూశామన్నారు. ఆ తర్వాత రాష్ర్టానికి రావలసిన మిగతా వాటాను కూడా ఈ ప్రాజెక్టు నుంచి తీసుకునే విధంగా డిజైన్ చేశామన్నారు. చంద్రబాబునాయుడు అనేక కుట్ర లు చేసిన దీన్ని ఆపలేకపోయారన్నారు. కేం ద్రంలో ఉన్న ప్రభుత్వంతో చంద్రబాబు సఖ్యతగా ఉం డడం ఎన్డీఏలో భాగస్వామి కావడం వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం తలపెట్టాలని ఎప్పుడూ చూస్తున్నారన్నారు. ఇదే కోవాలో మళ్లీ చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని కృష్ణ, గోదావరి జలాలను చేరబట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. అందుకే పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం తిప్పి పంపిందని అయినా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేదని మండిపడ్డారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదని, కానీ ఇప్పుడు ఏకంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వాపస్ పంపించడం కుట్ర లో భాగం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రెండేళ్లలో తీసుకుంటున్న చర్యలు మళ్లీ పాలమూరును కరువు కోరల్లోకి నెట్టుతున్నాయని అందుకే ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కృష్ణ, గోదావరి నది జలాల్లో జరుగుతున్న దోపిడీపై ప్రశ్నించడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది. త్వరలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జంక్ సైరన్ మొద లు పెడతారని తెలుసుకొని మరింత ఉత్సాహంతో ఉన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనుంచి చరమగీతం పాడేందుకు ఇటీవల వచ్చిన పంచాయతీ ఎన్నికలు నిదర్శనమని అంటున్నారు. కేసీఆర్‌పై బీఆర్ఎస్పై ఉన్న అభిమానమే పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందని.. ఇదే ఊపుతో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలి ఇస్తామన్నారు. కేసీఆర్ పాలమూరు జిల్లాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన వెంట నడుస్తామని క్యాడర్ అంటుంది. మొత్తంపై కేసీఆర్ జంగ్ సైరన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ శ్రేణులను కదిలిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని వెలిగెత్తి చాటేందుకు గ్రామ గ్రామాన పోరాటం సాగి స్తాం.. దీనికి సంబంధించి కార్యాచరణ మొదలవుతుంది.. పోస్టర్లు మిగతావి కూడా రెడీ అవుతున్నాయి.. జరిగే పోరాటంలో నేను కూడా పా ల్గొంటా.. డీపీఆర్ వాపస్ వచ్చిన 45 టీఎంసీలకు కుదించిన మాట్లాడతలేరు.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బహిర్గతం చేస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తుంది.. రెండు, మూడు రోజుల్లో జిల్లా నాయకులతో సమావేశమైకార్యాచరణ రూపొందిస్తాం.