మహబూబ్‌నగర్ నెట్వర్క్, ఫిబ్రవరి 17 : అపర భగీరథుడు.. జనహృదయ నేత.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు.. బ ంగారు తెలంగాణ స్వప్నికుడు.. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ బర్త్‌డేను ఊరూరా పండుగలా జరుపుకొన్నారు. సోమవారం జననేత నిండు నూరేండ్లు సల్లంగా ఉండాలని నీరా‘జనం’ పలికారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆలయాల్లో పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు భారీ కేక్‌లు కట్ చేసి.. స్వీట్లు పంపిణీ చేశారు. అన్నదానాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు జోరుగా కొనసాగాయి. అన్ని చోట్ల కేక్ కటింగ్‌లు, మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగాయి. జై కేసీఆర్.. జైజై కేసీఆర్.. కేసీఆర్ సారే రావాలి.. మ ళ్లా కారే రావాలి.. అంటూ నినాదాలు మార్మోగాయి.
కేసీఆర్ మళ్లా సీఎం కావాలంటూ దీక్ష బూనారు. పలు చోట్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి.. పటాకుల మోతలు హోరెత్తాయి. మక్తల్ నియోజకవర్గంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గోపాల్పేట మండలంలో చెరువులు, పంట పొలాల్లో రైతులు, కూలీలతో కలిసి గులాబీ పార్టీ శ్రేణులు వేడుకలో పాల్గొన్నారు. వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు తమ వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. రైతు కూలీలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. తిమ్మాజిపేట మండలం ఆవంచ సమీపంలోని ఏకశిలా గణపతి వద్ద మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు. అలాగే అలంపూర్, అయిజలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, చారకొండ మండలం జూపల్లిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కేక్ కటింగ్‌లో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, రజినీ సాయిచంద్ వేడుకల్లో పాల్గొన్నారు.