మాగనూరు, నవంబర్ 21: కర్ణాటక నుంచి ధాన్యం లారీల్లో తెలంగాణలోకి యథేచ్ఛగా తరలిస్తున్నది. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నా సంబంధిత అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో ధాన్యం తెలంగాణలోకి వస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైన సందర్భంగా పోలీసులు, వ్యవసాయ మార్కెట్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఇతర రాష్ర్టాలకు చెందిన ధాన్యం ఉంటే వెంటనే తిప్పి పంపించాల్సింది పోయి వాటికి పర్మిషన్ లేకపోయినా ఒక్కో లారీ నుంచి రూ.వెయ్యి, రెండు వేలు తీసుకొని తెలంగాణలోకి పంపిస్తు న్నారు.

ముఖ్యంగా వ్యవసాయ మారెట్లో వే బీలు ఉన్నా లేకున్నా ట్యాక్సీలు కట్టించుకోకుండానే వచ్చిన కాడికి దండు కుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కృష్ణ మండలం వాసునగర్ కర్ణాటక బార్డర్ దాటి మాగనూరు మండల కేంద్రంలోని అభిలాష్ దాబా సమీపంలో నిలుపుకొని ఉండడంతో సంబంధిత వ్యవసాయ ఏఈవో పవన్ స్థానిక పోలీసులు ఆ లారీలను పరిశీలించి వివరాలు అడగగా కర్ణాటక రాష్ట్రంలోని చిక్సూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు లారీ డ్రైవర్లు తెలిపారు.
వీటికి ఎలాంటి పర్మిషన్ లేదని కర్ణాటక ధాన్యం తెలంగాణలోకి రాకూడదని వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే దాదాపు అరగంట వ్యవధిలోనే అవే లారీలు మళ్లీ తిరిగి తెలంగాణలోని హైదరాబాద్ వైపు మాగనూర్మీదగా వెళ్లిపోవడం గమనార్హం. అయితే ఈ ధాన్యం లారీల వెనుకాల పెద్ద పెద్ద నాయకుల హస్తం ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.