గద్వాల/అయిజ/శ్రీశైలం/మక్తల్, ఆగస్టు 31 : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. జూరాల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టుకు 3,36,000 క్యూసెక్కుల వరద చేరుతుండగా ప్రాజెక్టు వద్ద 45 గేట్లు ఎత్తి 3,28,554 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,78,574 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,76,618 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,87,209 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,86,643 క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 42,142 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 10,067 క్యూసెక్కులు నమోదైంది.
ఆర్డీఎస్ ఆనకట్టకు 6,658 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 6,020 క్యూసెక్కులు ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం నాటికి 4,10,581 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా అవుట్ ఫ్లో 3,80,499 క్యూసెక్కులు నమోదైంది. అదేవిధంగా మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్(చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ఎగువ నుంచి 4వేల క్యూసెక్కుల వరద రావడంతో నాలుగు గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.