వెల్దండ, ఫిబ్రవరి 16 : హామీల అమలులో పూర్తిగా విఫలమై, రైతులను మోసిగించిన కాంగ్రెస్ పార్టీని గద్దె దిగాల్సిందేనని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చి నేడు వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఏఒక్క వర్గం కూడా ఆనందంగా లేదన్నారు.
రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని, ఎన్నాళ్లని ప్రజలను మోసం చేస్తూ తప్పించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, రైతులను మోసగించిన కాంగ్రెస్‌కు రాష్ర్టాన్ని పాలించే హక్కు లేదన్నారు. ఈ నెల 18న ఆమనగల్లు పట్టణంలో నిర్వహించే రైతుదీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. రైతుదీక్షకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, రైతులు అదిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
అనంతరం రైతుదీక్ష కరప్రతాలను విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పుట్టారాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్, నిరంజన్, శేఖర్, మధుసూదన్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు, మాజీ సర్పంచులు అంజినాయక్, వెంకటేశ్వర్రావు, తిర్మల్‌రావు, అంజయ్య, బాల్లక్ష్మయ్య, సోమయ్య, హన్మంతు, లింగం, రాములు, నాయకులు ఆనంద్, అశోక్, రాజు, దేవేందర్, రమేశ్, కొండల్, రమేశ్‌గౌడ్, శ్రీను, రవి,సత్యం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి, ఫిబ్రవరి 16 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 18వ తేదీన నిర్వహిస్తున్న రైతు మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మసత్యం వేర్వేరుగా పిలుపునిచ్చారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేటీఆర్ వస్తున్నారని, నియోజకవర్గ రైతులు, ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.