వనపర్తి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి నిరంతర త్రీఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. నిండు వానకాలంలో ఉన్నట్లుగా నదులు, ప్రాజెక్టులు ఇంకా పొంగిపొర్లుతున్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాలు నిరాటంకంగా కరెంట్‌ను ఉత్పత్తి చేస్తూ నే ఉన్నాయి. అయినా సేద్యానికి 24 గంటల్లో దాదాపు 10 గంటలపాటు త్రీఫేజ్ విద్యుత్‌ను నిలిపివేస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వనపర్తి జిల్లాలో దాదాపు 60 వేల వ్యవసాయ వి ద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురవగా పంటలు సాగయ్యా యి. నాలుగు ప్రధాన ప్రాజెక్టులతోపా టు చెరువులు, కుంటల ఆధారంగా వరి సాగుబడులు పెరిగాయి. గతం లో కంటే ఈ సారి జిల్లాలో 40 వేల ఎకరాలు ప్యాడీ సాగు పెరిగినట్లు వ్యవసాయ అధికారుల అంచనా. ఇలా మొత్తం జిల్లా వ్యాప్తంగా వరితోపాటు వేరుశనగ, పత్తి, కందులు, పెసర, మినుములు, ఆ ముదం, జొన్న, చెరకు, మొక్కజొన్న తదితర పంటలు 3. 47 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఇంత వరకు బా గానే ఉన్నా.. వ్యవసాయానికి సరఫరాయ్యే విద్యుత్ ఎక్కువగా పోతుండడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు.
10 గంటలపాటు కోతలు
వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్‌ను నిరంతరాయంగా అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా అనధికార కోతలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా రాత్రిళ్లు త్రీఫేజ్ కరెంట్ సరఫరా లేని సందర్భాలే అధికంగా ఉంటున్నాయి. చాలా వరకు వ్యవసాయానికి విద్యుత్ వాడకం పూ ర్తిగా తగ్గిపోయింది. వరి చేలన్నీ కోత దశలో ఉన్నందునా విద్యుత్‌తో అవసరం లేదు. అయినా ప్రస్తుతం కరెంట్ కోత లు కొనసాగుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వరి రైతులు తప్పా ఇతర పంటలు సాగు చేసిన అన్నదాతలకు త్రీఫేజ్ విద్యుత్ అవసరం ఉన్నది. పెద్దమందడి ప్రాంతంలో సాయంత్రం 6 గంటలకు త్రీఫేజ్ సరఫరా నిలిపి వేస్తూ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో వదులుతున్నారని రైతు లు వాపోతున్నారు. అలాగే ఏదుల మండలంలో సాయ ంత్రం 5 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు త్రీఫేజ్ ఉండటం లేదు. ఇక వీపనగండ్ల ఏరియాలోనూ సాయంత్రం 5 గంటలకు కట్ చేస్తుండగా.. రాత్రి 9 గంటలకు వస్తుందని, ఇప్పుడు మాత్రం అర్ధరాత్రి ఒంటిగంటకు అటు ఇటుగా త్రీఫేజ్ సరఫరా చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలా ఒక్కో ఏరియాలో ఒక్కో తీరుగా కరెంట్ కటింగ్‌లు కొనసాగుతున్నాయి.
వేరుశనగ, మినుములకు..
ఒక్క వరి పంట తప్పా ఇతర పంటలకు సాగునీరు అందించాలంటే విద్యుత్ అవసరం. ఎక్కువగా వేరుశనగ, మినుములు, పెసర, మొక్కజొన్న పంటలను విస్తారంగా సాగు చేశారు. వీటికి నీరు అందించడం అవసరం. ప్రస్తుతం కాల్వల్లో నీ రు గలగలా పారుతున్నది. ఎటు చూసినా పంటలు పచ్చగా దర్శనమిస్తున్నాయి. ముందుగాల సాగు చేసిన పంటలు చేతికందగా, ఇంకా నీటి తడులు కొన్నింటికీ అవసరం ఉన్నాయి. ఇంకా నెలరోజుల వయస్సు ఉన్న చేలు మినుములు, పెసర్లు దండిగానే ఉన్నాయి. ఇవే కాకుండా మొక్కజొన్న పంట సైతం భారీగానే సాగైంది. వీటికంతా నీటి తడులు జరగాలంటే విద్యుత్ అవసరం. రాత్రి.. పగలు తేడా లే కుండా రైతులు నీటి సౌకర్యాలు ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం రాత్రిళ్లు అధికంగా త్రీఫే జ్ కరెంట్ సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
యాసంగిలో ఎలా..?
నిండు వానకాలంలోనే ఇలా ఉంటే.. వచ్చే యాసంగిలో సేద్యానికి కరెంట్ సరఫరా ఎలా ఉంటుందోనని రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. చడీచప్పుడు లేకుండా ఇంతలా త్రీఫేజ్ కరెంట్‌ను నిలిపి వేస్తున్న అధికారులు ఇది చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదట. యాసంగిలోనూ జిల్లాలో భారీగానే సాగుబడులు కొనసాగే అవకాశం ఉన్నది. బోరు బావుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో ఊహించని విధంగా పంటలను సాగు చేయనున్నారు. ఇక రెండో పంటకు నీరు అందుతుందో? లేదో? అని ప్రాజెక్టుల అధికారులు అనుమానంగా చెబుతున్నారు. అయినా రైతులు మాత్రం ససేమిరా అంటూ యాసంగిలో వరి నాట్లు, వేరుశనగ, మొక్కజొన్న పంటలు భారీగానే వేసేందుకు సిద్ధమవుతున్నారు.
సేద్యానికి అవసరం తక్కువే..
ప్రస్తుతం వరి కోతలు కొనసాగుతున్నాయి. ఇతర పంటలు కొన్ని చేతికొచ్చాయి. ఈ పరిస్థితిలో రైతులు కరెంట్ వాడకం తక్కువగానే ఉంటుంది. గతంలో కార్పొరేట్ ఆఫీసు నుంచి వచ్చే ఆదేశాల మేరకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా జరిగేది. గతంలో నుంచి కూడా వస్తున్నది. ఇప్పుడు కొత్తగా చేయడం లేదు. జిల్లాలో ఎక్కువగా త్రీఫేజ్ పవర్ పోతున్న ప్రాంతాల నుంచి సమాచారం తీసుకుంటాం. రైతులకు సమస్య లేకుండా చూస్తాం. ఇప్పటి వరకు కర్షకుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.
– తిరుపతిరావు, ఎస్ఈ, విద్యుత్ శాఖ, వనపర్తి జిల్లా
రాత్రిళ్లు కరెంట్ రావడం లేదు
నేను నాలుగు ఎకరాల్లో మినుములు వేసుకున్న. రాత్రిళ్లు త్రీఫేజ్ కరెంటు ఉండడం లేదు. సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు. దీనికి మోటర్లు నడవవు. సాయంత్రం 5 గంటలకు పోతే, తెల్లవారు జామున 3 గంటలకు త్రీఫేజ్ వస్తుంది. అందుబాటులో కరెంట్ ఉంటే రైతు వీలు మేరకు పని చేసుకుంటాడు. పగలు మాత్రమే పని చేసుకోవాలంటే చాలా కష్టమవుతున్నది. కోతలు లేవని చెబుతూనే గంటల పాటు కరెంట్ కోతలు విధిస్తున్నారు.
– రామకృష్ణ, రైతు, అనంతాపురం, ఏదుల మండలం, వనపర్తి జిల్లా
సగం కరెంటే వస్తున్నది..
అధికారులు చెబుతున్న దాంట్లో సగం కరెంట్ మాత్రమే సేద్యానికి వస్తున్నది. పేరుకు 24 గంటలు త్రీఫేజ్ అంటున్నరు. ఇందులో సగం కూడా సక్రమంగా రావడం లేదు. రాత్రిళ్లు అసలే ఉండదు. పగలు కూడా బ్రేక్ డౌన్, లైన్‌క్లియర్ అంటూ కటింగ్‌లు చేస్తున్నందునా పగలు కూడా కష్టంగా ఉంది. నేను 5 ఎకరాల్లో 20 రోజుల కిందట మొక్క జొన్న వేసుకున్నా. ఒక్క తడి కట్టుకున్నా. రెండో తడికి ఇబ్బందులు పడుతున్నా. కరెంట్ ఇలాగే ఉంటే చాలా కష్టం.
– రవి నాయక్, రైతు, కొత్తకుంటతండా, పెద్దమందడి మండలం