కోడేరు, మార్చి 15 : చెంతనే కృష్ణా నదీ జలాలు గల గలా పారుతున్నా తమకు మాత్రం సాగునీళ్లు అందడం లేదు.. కనీసం చెరువులు కుంటలన్నా నింపుకుందామనుకున్నా కాల్వలు లేకపాయే.. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి సేద్యం చేస్తు ప్రతీసారి సాగు చేసిన పంటలకు పెట్టుబడులు ఎల్లక తీవ్రంగా నష్టపోతున్నామని నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం బాడుగదిన్నెతండా రైతులు వాపోతున్నారు.
తమ తండాకు కూతవేటు దూరంలో సింగోటం రిజర్వాయర్ ఉన్నా సాగునీటికి నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగోటం రిజర్వాయర్ నుంచి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న బాడుగదిన్నె గ్రామంతోపాటు తమ తండాకు సాగునీటిని అందించటానికి పాలకులకు చేతులు రావటం లేదని విమర్శిస్తున్నారు.
గతంలో పసుపుల పాన్గల్ బ్రాంచి కాల్వను మండలంలోని నర్సాయపల్లి, కొర్లకుంట, బాడుగదిన్నె, బాడుగదిన్నెతండా, గుట్టమీదితండా శివారు వరకు కాల్వను తవ్వి వదిలేశారు. అలాగే జూరాల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించటానికి వీపనగండ్ల మండలం కొర్లకుంట మీదుగా కోడేరు మండలం నర్సాయపల్లి, ఎత్తం శివారు వరకు కాల్వలు తవ్వారు. కనీసం జూరాల కాల్వనన్నా పూర్తి చేస్తే సింగోటం రిజర్వాయర్ నుంచి సాగునీరు అందే అవకాశం ఉంది. ఎంజీకేఎల్పీ ప్రాజెక్టులో భాగమైన పసుపుల, పాన్గల్ బ్రాంచి కాల్వను పూర్తి చేసినా తమకు సాగునీళ్లు అందుతాయని అధికారుల పాలకుల నిర్లక్ష్యం వల్ల కాల్వలు అసంపూర్తిగా వదిలేయటంతో తాము అన్ని రకాలుగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.