రఘునాథపాలెం, మార్చి 9 : మొక్కజొన్న పంట చేతికొస్తున్న తరుణంలో ఊరూరా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్వింటా రూ.2,400 చొప్పున మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు ప్రదర్శనగా చేరుకున్నారు. తమ డిమాండ్లపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘాల జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేశ్, బొంతు రాంబాబులు మాట్లాడుతూ ప్రభుత్వం మార్క్ఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాల్లో దళారులు తక్కువ ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన చెందారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కరువైందని, ప్రభుత్వాలు నిర్ణయించే మద్దతు ధర కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నది తప్ప అమలుకు నోచుకోవడం లేదన్నారు. గడిచిన రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది మొక్కజొన్న పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని, కొనుగోలు కేంద్రాలు లేని కారణంగా దళారులకు అమ్మి మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రైవేటు వ్యాపారులు క్విం టాకు రూ.1,400 నుంచి రూ.1,500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. దీంతో రైతులు క్వింటాకు రూ.800 వరకు నష్టపోతున్నారని, కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15కల్లా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, మాదినేని రమేశ్, ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, డేరంగుల లక్ష్మయ్య, అడపా కృష్ణయ్య, భుక్యా వీరభద్రం, రవికుమార్, వాసిరెడ్డి ప్రసాద్, షేక్ ఖాసీం, పాశం అప్పారావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.