వనపర్తి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : జూరాల ఆయకట్టు రైతులు ఆశ లు అడుగంటుతున్నా యి. చేతికొచ్చిన పంటలు కండ్లముందే ఎండిపోతుం టే ఆవేదన చెందుతున్నారు. సాగునీళ్లిచ్చి పంటలు కాపాడాలని రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతుండగా, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాలతోపాటు ఆర్డీఎస్, కోయిల్‌సాగర్ కూడా చివరి దశలో సాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో అన్నదాతలు అగమ్యగోచరంలో పడ్డారు. ఉమ్మడి జిల్లా వారీగా చూస్తే వ్యవసాయానికి జూరాల ప్రాజెక్టు వర ప్రదాయినిగా ఉన్నది.
వానకాలం శిస్తు ముగిసిన అనంతరం యాసంగిలోనూ మళ్లీ వరి సాగుకు ప్రాధాన్యతనిచ్చారు. సమృద్ధిగా వర్షాలు, నిండుగా ఉన్న జూరాలను చూసిన రైతులు యాసంగిలో వరి నాటుకున్నారు. ప్రస్తుతం జూరాల కుడి కాల్వ కింద 25వేల ఎకరాలు శిస్తు జరిగితే, ఎడమ కాల్వ కింద 40వేల ఎకరాలు సాగు జరిగినట్లు అంచనా ఉన్నది. ప్రధానంగా ఎడమ కాల్వ కింద ఉన్న పొలాలు చాలా వరకు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. నీటి విడుదల పూర్తిగా నిలిచిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో వేసిన పంటలు ఎండిపోతుంటే పట్టించుకోరా అంటూ అన్నదాతల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
యాసంగి సాగుపై పాలకులు ముందు నుంచి నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రతి యేటా జరగాల్సిన ఐఏబీ మీటింగ్‌ను ఏర్పాటు చేయకపోవడం, ఎవరివారు అన్నట్లుగా వ్యవహరించడం వల్లే నేడు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ముందుస్తుగా సమావేశం ఏర్పాటు చేసి రైతులు, అధికారులు, ఎమ్మెల్యేలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే ఇలా జరిగి ఉండేది కాదన్న విమర్శలు వెలువెల్తుతున్నాయి. యాసంగి సాగుకు రైతులు సిద్ధమైన అనంత రం చివరి దశలో ఇరిగేషన్ అధికారుల ద్వారా పత్రికల్లో ప్రకటనలు చేయించి ఎమ్మెల్యేలు గుట్టుగా ఉన్నారు.
దాని ఫలితమే నేడు చివరి దశలో ఉన్న పంటలన్నీ ఎండిపోతున్నాయి. జూరాలకు కూతవేటు దూరంలో ఉన్న గ్రామాల పంటలు సైతం ఎండుముఖం పట్టాయి. గతంలో ఇంతటి నిర్లక్ష్యాన్ని చూడలేదని రైతులు వాపోతున్నారు. ముందుస్తు సమాచారం ఇవ్వకుండా సాగు చేసిన అనంతరం తైబంది, వారబంది అంటూ ప్రకటనలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు కర్ణాటకు వెళ్లి 4టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయిస్తామని అప్పట్లో ప్రకటనలు చేసినా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు అడపాదడపా ఒక్క టీఎంసీ నీరు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంకా 3 టీఎంసీల నీటిని విడుదల చేయించాల్సి ఉన్నది. ఆయకట్టు పంటలన్నీ ఎండిపోతుండగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పంటలు ఎండుతున్నా.. తమ బాధను రోడ్లపైకి వచ్చి వెల్లడించినా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే చివరకు పోలీసులను పంపిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. వరుస ధర్నాలతో కాల్వల వెంట రైతులు పాకులాడుతున్నారు. మీరు చె ప్పిన ఆల్మట్టి నీళ్లు ఎక్కడంటూ కనిపించిన వారినం తా రైతన్నలు అడుగుతున్నారు. జూరాల గేట్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో లీకేజీలు జరుగుతున్నాయి. అధికారులు దృష్టి సారిస్తే నీరు ఆదా అయ్యే అవకాశం ఉన్నది.
ఐదెకరాల్లో వరిపంట సాగుచేసిన. పంట చేతికి రావా లంటే ఇంకా రెండు తడులు అవసరమవుతాయి. జూరాల కాల్వ కిందనే నా పొలం ఉంది. పక్క పొలం రైతు బోరుతో నీటి కోసం ప్రయత్నిస్తున్నా.
నీటి తడులు అందకుంటే నిండా మునగాల్సిందే. అప్పులపాలై అవస్థలు పడుతాం. జూరాలకు ఇంత దగ్గర ఉండి నీటికి ఇబ్బందులు పడు తున్నాం. బీఆర్ఎస్ సర్కారులో ఎన్నడూ ఇంత ఇబ్బంది రాలే. ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకుంటలేరు. ప్రభుత్వం ఇట్లనే ఉంటే రైతులు నష్టపోవాల్సిందే. ఇప్పటికైనా స్పందించి రెండు తడులకు నీళ్లు ఇవ్వాలి.