మాగనూరు, మార్చి 9 : వరిపంటలకు భూగర్భజలాలు అడుగంటి చుక్కనీరు రాక పొలాలు బీటలుగా మారాయి. మాగనూరు మండలం కొల్పూర్ పరిధిలో అడవి సత్యారం, కొల్పూర్, మందిపల్లి, పుంజనూరు గ్రామాల్లో కరెంట్ కోతలకు వరిపంటలు ఎండిపోతున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. పంటలు పొట్ట దశలో ఉండగా, 15రోజుల వరకు సాగునీరు పెట్టా ల్సి ఉందని, కరెంటు సమస్యతో అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చివరికి ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయే స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రైతులు సొంతంగా ట్రాక్టర్లో ట్రాన్స్ఫార్మర్ తరలించి రిపేర్ చేయిస్తున్నారు. అడవి సత్యారం గ్రామానికి చెందిన నరసింహ గౌడ్ ఐదెకరాల వరి సాగు చేశాడు. ఎండాకాలం రాకముందే బోర్లు పూర్తిగా ఇంకిపోవడంతో సాగునీరు లేక మూడు ఎకరాలకు పెగానే పూర్తిగా ఎండిపోయింది. దీంతో చేసేది లేక మేకలు, పశువుల మేతకు వదిలేసినట్లు తెలిపారు. సాగునీటి సదుపాయంతోపాటు కరెంటు సమస్యలతో పంటలను ఎండుతున్నట్లు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.