అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలు, ఆలయ నిధులను లెక్కాపత్రం లేకుండా అప్పనంగా ఖర్చు పెడుతున్నా రన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జోగుళాంబ సముదా యాల్లో కొన్నేళ్లుగా తిష్టవేసిన పూజారులు, అధికారులు, సిబ్బంది కుమ్మక్కై రూ.కోట్లు దండుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కనీస సౌకర్యాలు కూడా కల్పించ కుండా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోలేదు.
ఈ క్రమంలోనే ఆలయంలో జరుగుతున్న అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ఈ గోల్మాల్ వ్యవహారంలో అందరూ భాగస్వాములే అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతున్నా పాలకమండలి పట్టించుకోవడం లేదు. ఆలయంపై కనీస అవగాహన లేని వ్యక్తులకు పాలకమండలిలో స్థానం కల్పించడంలో ఇక్కడి అర్చకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పాలకమండలికి కూడా ఈ అవినీతి, అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
– మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ అలంపూర్, ఏప్రిల్ 17
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాయి. 2005లో జోగుళాంబ ఆలయం పునఃప్రతిష్ఠాపన తర్వాత క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. క్రమంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ క్షేత్రంపై దృష్టిసారించకపోవడంతో క్షేత్రంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగకపోగా, అవినీతి రాజ్యమేలుతూ వస్తున్నది.
ఆలయంలో చాలాకాలంగా తిష్టవేసిన ఆలయ సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పిందే మంత్రం, ఇచ్చిందే తీర్థం అన్న చందంగా మారిపోయింది. ఏడాదికి రూ.కోట్లల్లో ఆదాయం ఉన్నటువంటి ఈ ఆలయాలకు ఐఏఎస్ క్యాడర్ ఈవోను నియమించాల్సిన ఉన్నా, దేవాదాయ శాఖ మిగతా ఆలయాల మాదిరి కిందిస్థాయి సిబ్బందిని ఇక్కడ నియమిస్తున్నది. ఏడాదికోసారి మారే పాలక మండలి సభ్యులకు అవగాహన లేకపోవడంతో ప్రశ్నించలేకపోతున్నారు. ఇదే అదనుగా భావించి అర్చకులు, ఆలయ సిబ్బంది అక్రమాలకు తెరలేపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి హయాంలో అలంపూర్ క్షేత్రంలో యాత్రికుల సౌకర్యార్థం వసతిగృహం ఏర్పాటు చేశారు. అయితే వసతిగృహంలో 10 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ, సుమారు రూ.30లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించి నొక్కేశారు. అంతేకాకుండా భక్తులు ఇచ్చే విరాళాలకు సంబంధించి లెక్కాపత్రం లేకపోగా, ఒరిజనల్ బుక్కులకు తోడు డూప్లికేట్ బుక్కులు వాడుతూ పెద్ద మొత్తంలో స్వాహా చేస్తున్నారు.
జోగుళాంబ ఆలయంలో అవినీతి పరాకాష్టకు చేరుకున్నది. ఆలయాల్లో పనిచేసే ఆధికారులు కొందరు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదు చేసి ఆ ఖర్చులు ఆలయ లెక్కల్లో జమ చేసుకుంటున్న ఆరోపణలున్నాయి. ఆలయంలోని రికార్డులు పరిశీలిస్తే అన్నీ బయటపడే అవకాశమున్నది. అంతేకాకుండా జోగుళాంబ అమ్మవారికి, బాల బ్రహ్మేశ్వరస్వామికి మొక్కుబడుల కింద ఖరీదైన బంగారంతో చేసిన వస్తువులు సమర్పించుకుంటున్నారు. వీటిని కూడా మాయం చేసినట్లు తెలుస్తోంది. దాతలు ఇచ్చిన వస్తువులకు లెక్కలు లేకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది. ఆలయంలో ఉత్సవ విగ్రహాలతోపాటు గర్భాలయంలో ఉండే విగ్రహాలకు వాడుతున్న కాలం చెల్లిన వస్తువులు కనుమరుగవుతున్నాయి.
జోగుళాంబ ఆలయానికి ప్రతి యేటా లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు అందుబాటులో ఉండేందుకు టెంకాయలు, పూజా సామగ్రి, పార్కింగ్ కోసం యేటా టెండర్లు నిర్వహించిన సొమ్ము కూడా స్వాహా అవుతున్నది. టెండర్‌దారులతో కొంచెం కట్టించుకొని మిగతాది ఆలయ సిబ్బంది నొక్కుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. చాలా మంది టెండరు బాపతు సొమ్ము జమ చేయకుండా బకాయి ఉన్నారనే ఆరోపణలున్నాయి. అమ్మవారికి భక్తులు ఇష్టంగా సమర్పించుకున్న చీరలను ఆలయం తరఫున వేలం వేస్తారు. ఈ వేలం టెండర్ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చే ముందే సుమారు 10వేల విలువైన చీర లు మాయమయ్యాయి.
వీటి విలువ సుమారు రూ.30లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆలయలకు ప్రముఖులు వచ్చినప్పుడు వారికి ఎర్ర తివాచీలు పరిచి ప్రత్యేక దర్శనాలు చేయించి విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. దీంతో ఆలయంలో జరిగే వ్యవహారాలపై దృష్టి సారించడం లేదని తెలుస్తున్నది. అర్చకులు ఆలయ సిబ్బంది అంతా కుమ్మక్కు కావడంతోపాటు ఏండ్ల తరబడి తిష్టవేసిన వారి వల్లే జోగుళాంబ అమ్మవారికి అపఖ్యాతి కలుగుతుందని భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జోగులాంబ ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
అలంపూర్ జోగుళాంబ ఆలయంలో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఎటువంటి పొరపాట్లు జరగలేదు. గిట్టనివారు ఉద్దేశ పూర్వకంగా ఇలా చేస్తున్నారు. ఆలయంలో అన్నీ నిబంధనల ప్రకారం, సవ్యంగానే జరుగుతున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
– పురేందర్ కుమార్, ఆలయ ఈవో, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం