Akhanda 2 | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ 2 థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీ వేదికపై మాత్రం సరికొత్త విజయగాధను రాస్తోంది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆదిపినిశెట్టి, సంయుక్త, పూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. శివతత్వం ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 12న విడుదలైంది. అసలు డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా ఆర్థిక కారణాల వల్ల వారం రోజుల వాయిదాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే విడుదల ఆలస్యం, కథనంలో ఎక్కువగా ఆధ్యాత్మిక బోధనలు ఉండటం, ‘అఖండ’ స్థాయి ఎమోషన్ మిస్ కావడం వంటి కారణాలతో ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విమర్శకుల నుండి కూడా మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఇదే సినిమా ఓటీటీలో మాత్రం ఊహించని రీతిలో పుంజుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక Netflix లో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రారంభంలో పెద్దగా గుర్తింపు పొందకపోయినా, క్రమంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ట్రెండ్‌లోకి వచ్చింది. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా శివభక్తి నేపథ్యం ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువగా వీక్షిస్తున్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
ఇండియా వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ జాబితాలో ఈ చిత్రం తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం. ఓటీటీలోకి వచ్చి నెల రోజులు దాటిన తర్వాత కూడా ట్రెండింగ్‌లో ఉండటం సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిని తెలియజేస్తోంది. థియేటర్లలో నిరాశపరిచిన సినిమా ఓటీటీలో విజయాన్ని అందుకోవడం అరుదైన విషయమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 జాబితాలో ఇతర చిత్రాలు, షోలు కూడా పోటీగా ఉన్నప్పటికీ ‘అఖండ 2’ తన ప్రత్యేక శివతత్వ కంటెంట్‌తో నిలదొక్కుకుంటోంది. ఆలస్యంగా అయినా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ డిజిటల్ వేదికపై బాలయ్య సినిమా మరోసారి తన మార్క్ చూపిస్తోందని చెప్పవచ్చు.