తాండూర్ : మండలంలోని కిష్టంపేటలో ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Houses ) కేటాయింపులో ఎస్టీలకు అన్యాయం జరిగిందని బీజేపీ బూత్ అధ్యక్షుడు ఏముర్ల ప్రవీణ్ తహసీల్దార్ జ్యోత్స్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో తాండూరు మండల కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుని అనర్హులకే ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. కేవలం ఏడుగురికే ఇళ్లు రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఎంపిక ప్రక్రియ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు కలిసి చేశారన్నారు. మండలంలోని అనేక గ్రామపంచాయతీలలో ఎందరో నిరుపేదలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అనర్హులకు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించుకున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భరత్, చిరంజీవి, ప్రదీప్, విజయ్, శేషగిరి, మల్లేష్, శ్రీనివాస్, విగ్నేష్, రమేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.