నాడు వలసలకు కేరాఫ్‌గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. సీఎం కేసీఆర్ సాగునీటి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు రైతును రాజును చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బీడు భూములుగా ఉన్న పొలాలు నేడు పచ్చని పొలాలతో దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో సాగునీటి వనరులు పెరగడం.. వ్యవసాయం పండుగలా సాగుతుండడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి మన పల్లెలకు కూలీలు వలస కట్టారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు కూలీలు వచ్చి వరి నాట్లు, పత్తి, ఇతర పంటల సాగు పనులు చేస్తున్నారు. ఒక్కో పల్లెలో వందకుపైగా పాగా.. పెద్ద పంచాయతీ అయితే 500 మందికిపైగానే గుత్త రూపంలో కూలి తీసుకుంటూ ఉత్సాహంగా పనులు చేస్తున్నారు. ఖర్చులన్నీ పోను నెలకు ఒక్కొక్కరికీ రూ.18 వేల వరకు గిట్టుబాటవు తున్నది. ఇలా బృందాలుగా ఏర్పడి ఐదు నెలలపాటు శ్రామిక జీవనం గడిపి పనులు ముగిశాక సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. తక్కువ కూలికే పనులు చేస్తుండడంతో రైతుల కష్టాలు తీరాయి.
– ధరూర్/వనపర్తి రూరల్, జూలై 26
ధరూర్, జూలై 26 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట పత్తిని సాగు చేస్తుంటారు. కాటన్ సీడ్ పంట సీజన్ మొదలైతే కూలీలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్లో ప్రైవేట్ ఉద్యోగుల నెల జీతం కంటే వీరి కూలి రేట్లే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సీజన్లో సదువుకున్నోడు, సదువులేనోడు అనే తేడా లేకుండా అందరూ వచ్చి పత్తి చేళ్లలో పనుల చేస్తుంటారు. ఉదయం పువ్వుతో క్రాసింగ్ చేయాలి. మధ్యాహ్నం మొగ్గలు గిల్లాలి. ఇది ఒకరిద్దరితో అయ్యే పని కాదు. ఏ రోజుకారోజు పువ్వులు గిల్లడం, పుప్పొడితో క్రాసింగ్ చేయాలి. లేదంటే చేసిన శ్రమ అంతా వ్యర్థమవుతుంది. అందుకే కూలీలకు అంత డిమాండ్.
సాగు విధానం ఇలా : ప్రతి పంటకూ నీరు చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. విత్తులు వేసినప్పుడు ప్రతి రోజూ నీరు పెట్టాల్సి ఉంటుంది. మొక్క దశకు చేరుకున్నాక రోజు విడిచి రోజు నీరు పెట్టాల్సి వస్తుంది. మరీ పెద్దయ్యాక మూడురోజులకోసారి నీరు పెట్టాలి. వారానికోసారి మందులు పిచికారీ, అడుగు మందు వేయాల్సి ఉంటుంది. కాబట్టి పెద్ద ఖర్చుతో కూడుకొని ఉంటుంది.
వలస కూలీలు : ప్రభుత్వం మెరుగైన సాగునీటి సౌకర్యాలు కల్పించడంతో బైలు పొలాల్లో సైతం రైతులు పత్తి సాగుపై దృష్టి పెడుతున్నారు. పిల్ల కాల్వల్లో నిత్యం నీరు ప్రవహిస్తున్నందున పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కూలీల కొరత ఏర్పడడంతో పొరుగు రాష్ర్టాల కూలీలకు గిరాకీ పెరిగింది. కర్ణాటకలోని రాయిచూరు, ఏపీలోని కర్నూల్ జిల్లా నుంచి వలస కూలీలు జతలు జతలుగా ఇక్కడికి వచ్చి పని చేసుకొని చేతినిండా డబ్బుతో వెళ్తుంటారు. ఇప్పటికే చిన్న గ్రామాల్లో 100-150 మంది దాక కూలీలు దిగారు. పెద్ద గ్రామంలో అయితే 500 మంది పైచిలుకే ఉంటారు. వీరి ఒక్కొక్కరికి భోజనం, జబ్బు పడితే దవాఖాన ఖర్చులు రైతే భరించి నెలకు రూ.18వేలు ఇస్తారు.
రైతు పొలానికి చేరుకున్నప్పటి నుంచి మాకు రోజు హాజరు పడుతూనే ఉంటుంది. వర్షాలు పడినా, పని జరగకున్నా అదేదీ మాపై ఉంచకుండా నెల కాగానే మా కూలి మాకు చెల్లిస్తున్నారు. మా జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఈ పద్ధతి లేదు. అక్కడ పని మానితే కూలి కట్ చేస్తరు. కానీ ఇక్కడి రైతులు మాకు జ్వరం వచ్చినా, వర్షం వచ్చి పని జరుగకున్నా మా కూలి డబ్బులకు ఢోకా ఉండదు. ఇంతటి సేదానం ఇక్కడ ఉంది కాబట్టే రైతులు మాకు కడుపునిండా అన్నం పెట్టి, చేతి నిండా డబ్బుతో సాగనంపుతున్నరు. ఏమైనా కేసీఆర్ వల్ల వ్యవసాయం బాగుంది. మాకూ పని దొరుకుతోంది. మీ ప్రభుత్వం సల్లంగ ఉండాలి.
మాది కర్నూలు జిల్లా కొడుమూరు తాలుకా ఎర్రవాడ గ్రామం. మేము ప్రతి ఏడాది ఈ సీజన్లో ఇక్కడికి వస్తుంటాం. మూడు నెలలు పని చేసుకుంటాం. మాకు అన్ని ఖర్చులు రైతే చూసుకొని చివరిగా ఒక్కొక్కరికి రూ.18వేలు ఇస్తున్నారు. వర్షాలు పడినా, జ్వరం వచ్చినా కూలీ డబ్బుల్లో కోత పెట్టరు. నెల పూర్తయితే కచ్చితంగ మా కూలీ పైసలు మేము తీసుకుంటం. ప్రస్తుతం ఒక రైతు వద్ద మేం 20మందిమి ఉన్నాం. ఆడామగ తేడా లేకుండా అందరికీ ఒకే కూలి.
– రాజేశ్వరి, కొడుమూరు, కర్నూలు జిల్లా
ప్రతి ఏడాది మా కూలి రేట్లు పెరుగుతూనే ఉన్నయి. నేను ఇక్కడ పని చేయడానికి ఏడేండ్లుగా వస్తున్నా. ఇక్కడ కూలీ మొదట రూ.8వేలు మాత్రమే ఉండేది. చాలా తక్కువ కాలంలో సాగునీటి సౌకర్యాలు మెరుగవడంతో, పంట విస్తీర్ణం పెరిగింది. ప్రతి ఏటా మాకు చెల్లించే కూలి రేటు కూడా మారుతూ వస్తోంది. పొయిన ఏడాది రూ.16వేలు ఇచ్చారు. ఇప్పుడు రూ.18వేలు ఇస్తునరు. మేము మా పొలాల్లో పని చేస్తే కూడా ఇంత డబ్బు రాదు. కేసీఆర్ ఎక్కిన కాన్నుంచి మాకు ఇక్కడ పని ఫుల్, పైసలు ఫుల్.
– స్టాలిన్, గోనెగండ్ల, కర్నూల్ జిల్లా
ఇక్కడ మాకు ఐదు నెలలు ఉపాధి దొరుకుతుంది. మొదటి మూడు నెలలు మొగ్గలు గిల్లే పనిలో సరిపోతుంది. నెల తర్వాత పత్తి తెంపే పని ఉంటుంది. ఇలా ప్రతి ఏడాది ఇక్కడ పని చేసేందుకు వస్తాం. ఒకప్పుడు ఇక్కడి నుంచి చాలామంది బతుకు దెరువుకు కర్ణాటకలోని క్యాంప్‌లకు వచ్చేవారు. కానీ నేడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తునరు. ఇక్కడ సాగునీటి సౌకర్యం, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు బాగున్నయి. అందుకే అందరూ వ్యవసాయం చేసుకొని బతుకుతూ మా అసంటోళ్లకు బతుకు దెరువునిస్తున్నరు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మీ అదృష్టం.
– ప్రసంగి, ఇడుపునూర్ మండలం, రాయిచూరు జిల్లా, కర్ణాటక
మాది గుంటూరు జిల్లా బాపట్ల. వరి నాట్లు వేయడానికి కూలీలు కావాలని కొంతమంది సమాచారమిచ్చారు. నేరుగా ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి పని ఒప్పందం చేసుకున్నాం. ఇక్కడి ప్రాంతమంతా మా కోనసీమలాగే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలు కనిపిస్తున్నయ్. మా ఊళ్లోనే ఉన్నట్లుంది. 35మందితో ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు 30 ఎకరాల్లో నాట్లు వేశాం. ఎకరానికి రూ.5వేల చొప్పున రోజుకు 5 ఎకరాల్లో నాట్లు వేస్తున్నాం. మా పని చూసి పక్క గ్రామాల వాళ్లు కూడా మమ్మల్ని నాట్లు వేయడానికి పిలుస్తున్నరు. నాట్లు మొత్తం చూసుకొని వెళ్తాం.
– ముసలయ్య, బాపట్ల, ఏపీ