గద్వాల, జూన్ 11 : భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా తగ్గిపోయాయి. భూ బదలాయింపుల కోసం వచ్చే వారితో మొన్నటి వరకు కిటకిటలాడిన సబ్‌రిజిస్ట్రార్, తాసీల్దార్ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. గతంలో రెవెన్యూ కార్యాలయాల్లో రోజుకు 10 వరకు భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ ప్రస్తుతం రెండు అంకెలు దాటడం లేదు. ఇక మున్సిపాలిటీల పరిధిలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతినిత్యం స్థలాల రిజిస్ట్రేషన్లు 62 నుంచి 70 వరకు జరిగేవి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం భూముల, ప్లాట్ల ధరలు పెంచడంతో ప్రతి రోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు కూడ జరగడం లేదని అధికారులే అంటున్నారు.
ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య 20 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో కొనుగోలు దారులపై భారం పడడంతో రిజిస్ట్రేషన్లు మందగించి సగానికిపైగా తగ్గిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములు, ప్లాట్ల ధరలు పెరిగి రియల్ రంగం బాగా పుంజుకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రియల్ రంగం కుదేలైంది. కనీసం కొన్న ధరలు కూడ రాకపోవడంతో ప్లాట్ల యజమానులు క్రయవిక్రయాలు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని స్థలాల రిజిస్ట్రేషన్ ధరలు పెరగలేదు.. కానీ పట్టణ ప్రాంతాల్లోనే ఆయా ప్రాంతాల్లో మార్కెట్ పరిసరాల ఆధారంగా ధరలు ప్రభుత్వం భారీగా పెంచింది. పెరిగిన ధరలతో కొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో గజం ధరలు మాత్రం బాగా పెరిగాయి. దీంతో పట్టణ ప్రజలు లబోదిబోమంటున్నారు. పట్టణ నివాస స్థలాలకు సంబంధించి గతంలో ఏరియాను బట్టి చదరపు గజానికి రూ.2,400 ఉన్న చోట రూ.4,200, రూ.6,500 ఉన్నచోట రూ. 9,900, రూ.9,500 ఉన్న చోట రూ.1,4300కు పెంచా రు. అదే విధంగా వాణిజ్య స్థలాలకు సంబంధించి గతంలో చదరపు గజం రిజిస్ట్రేషన్ ధరను రూ.5,800 నుంచి రూ.10,200లకు, రూ.12,500 ఉన్న చోట రూ.15,700కు ప్రభుత్వం పెంచింది.
దీంతో పాటు అయిజ మున్సిపాలిటీ పరిధిలో చదరపు గజం రూ.2,700 ఉండగా.. ప్రస్తుతం రూ.3,200కు, రూ.1,700 ఉన్నది. ప్రస్తుతం రూ.3 వేల వరకు పెరిగింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో చదరపు గజం ధర రూ.3,100 ఉండగా ప్రస్తుతం రూ.3,900కు పెరిగింది. ఇలా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెరిగాయి. గద్వాల జిల్లాలో మార్కెట్ విలువతోపాటు రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ చార్జీలు భారీగా పెరగడంతో రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు గద్వాల సబ్‌రిజిస్ట్రార్ తెలిపారు.
నారాయణపేట, జూన్ 11 : గతంలో మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ఇంటి స్థలాలు, నిర్మాణాల రిజిస్ట్రేషన్ల ధరలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రెట్టింపు చేయడంతో గతంలో రూ.50వేలకు అయ్యే రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం రూ.లక్ష 20వేల వరకు అవుతుండడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో చదరపు గజానికి రూ.700 నుంచి రూ. 1300 వరకు పెంచిన ప్రభుత్వం, చదరపు ఫీటుకు రూ.1100 పెంచింది. మున్సిపాలిటీల్లో మా త్రం రెట్టింపు ధరలతోప్రజల నడ్డి విరిచిన విషయం పెరిగిన ధరలు చెప్పకనే చెబుతున్నాయి. నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీలు ఉండగా జిల్లా పరిధిలో మొత్తం 13 మండలాలు ఉన్నాయి.
నారాయణపేట మున్సిపాలిటీలో నిర్మాణ స్థలం చదరపు ఫీటుకు ఇది వరకు రూ.1100 ఉండగా ప్రస్తుత ప్రభుత్వం రూ.300 పెంచింది. అదే విధంగా రూ.5800లు ఉన్న చదరపు గజాన్ని రూ.11,700, రూ.4800 ఉన్న చదరపు గజాన్ని రూ.8,400, రూ.4800 లు గా ఉన్న చదరపు గజాన్ని రూ.10,200 రూ.3100 ఉన్న చదరపు గజాన్ని రూ.6,200, రూ. 3300ఉన్న చదరపు గజాన్ని రూ.8,200 చొప్పున పెంచింది. మక్తల్ మున్సిపాలిటీలో గజం ధర రూ. 900 నుంచి రూ.7,900 మధ్యన ఉండగా, చదరపు ఫీటుకు రూ.1300 పెరిగాయి. మద్దూరు మున్సిపాలిటీలో గజం ధర రూ.1400 నుంచి రూ.1800 మధ్యన ఉండగా, చదరపు ఫీటుకు రూ.1300 పెరిగాయి. కోస్గి మున్సిపాలిటీలో గజం ధర రూ.3700 నుంచి రూ.10,200 మధ్యన ఉండగా, చదరపు ఫీటుకు రూ.1300 పెరిగాయి. ఇవి ఈ నెల 5వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.
అప్పటి నుంచి మున్సిపాలిల్లో పెద్దగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. 5వ తేదీన 22, 6వ తేదీన 16, 8వ తేదీన 27, 9వ తేదీన 33, 10వ తేదీన 38 చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో కూడా ప్రతిరోజూ సెల్ రిజిస్ట్రేషన్లు ఒకటి, రెండు మాత్రమే ఉన్నాయని, మిగతావి మార్టిగేజ్, గిఫ్ట్ డీడ్, దాన సెటిల్మెంట్ దస్తా వేజులు ఉన్నాయని తెలుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఎకువ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవాలని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు రెట్టింపు చేయడంతో ప్రభుత్వానికి గతంలో వచ్చే ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం సమకూర్చవచ్చు కానీ, అదే సమయంలో ప్రజలపై తీవ్ర భారం వేసింది.
ఊట్కూర్, జూన్ 11: ప్రభుత్వం వ్యవసాయ భూము లు, గృహ నిర్మాణాల ప్లాట్ల రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచడంతో రియల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఊట్కూర్, మక్తల్, మాగనూర్, నర్వ మండలాల్లో గతంలో ఎకరా భూమికి రూ.18 వేల నుంచి రూ.20 వేలు ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రస్తుతం ఎకరాకు రూ. 30 వేలకు ప్రభుత్వం పెంచింది. దీంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడింది. దీనికితోడు రిజిస్ట్రేషన్లు సగానికి సగం తగ్గాయని అధికారులే చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభం, పెరిగిన నిర్మాణ వ్య యాలతో ఇబ్బందులు పడ్తున్న ప్రజలకు ప్రభుత్వం మ రింత భారాన్ని మోపిందన్న విమర్శలు ఉన్నాయి.
మక్తల్ మండలం లింగంపల్లి శి వారులో ఇటీవల రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. గ తంలో ఎకరాకు రూ.21 వేలు రిజిస్ట్రేషన్ చార్జీని నేటి ప్రభుత్వం ఏకంగా రూ.33 వేలకు పెం చిం ది. రెండెకరాలకు రూ. 66 వేలు ఖర్చయ్యింది. వ్యసా యం ఇప్పటికే నష్టాలతో సాగుతోంది. రిజిస్ట్రేషన్ చా ర్జీల పెంపు చిన్న, సన్న కారు రైతులపై అదనపు ఆర్థిక భారమే.. ప్రభుత్వం రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తగ్గించేలా చూడాలి.
– బొక్క నర్సింహ, రైతు, లింగంపల్లి, మక్తల్ మండలం