గద్వాల, మార్చి 29 : జిల్లాలో ఇసుక జీరో దందా జోరుగా కొనసాగుతున్నా ఇటు రెవెన్యూ, అటూ మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండంతో ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. అక్రమ ఇసుక రవాణా చేసి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఇసుక జీరో దందా కొనసాగుతున్న నిఘా మాత్రం నిద్రపోతున్నది. ఇసుక దందా చేసే దళారులకు ఖాకీ, కలం, ఖద్దరు తోడు కావడంతో జిల్లాలో వారి వ్యాపారం మూడు పువ్వులు..
ఆరు నోట్లుగా కొనసాగుతున్నది. ఓ వైపు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక దొరకక సామాన్యులు అవస్థలు పడుతుంటే బడాబాబులకు మాత్రం ఇసుక అవలీలగా దొరుకుతుంది. ఇందిరమ్మ ఇండ్లకు టిప్పర్ల ద్వారా ఇసుక అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అయితే నదిలో నీటి ప్రవాహం తగ్గడం వల్ల ఇసుక సరఫరా చేయలేమని చెబుతున్న మైనింగ్ అధికారులు, టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా జిల్లాలో ఇసుక అక్రమ సరఫరా అవుతుంటే లబ్ధిదారులకు ఏమి సమాధానం చెబుతారనేది ప్రశ్నగానే మిగులుతుంది. దీంతో జిల్లాలో ఇందిర్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక గుదిబండగా మారింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలోకి అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఇసుక పాలసీని ఆధారంగా చేసుకొని రాయలసీమ ప్రాంతమైన కర్నూల్, నాగల్‌దిన్నె, మంత్రాలయం తదితర ప్రాంతాల నుంచి తుంగభద్ర నదిలో ఇసుకను ఇక్కడి వ్యాపారులు టన్నుకు రూ.200కు కొనుగోలు చేసి అక్కడి నుంచి టిప్పర్లు,ట్రాక్టర్ల ద్వారా రయ్ రయ్ మంటూ గట్టు మండలంలోని అడవి ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రివేళల్లో గద్వాల పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు ఒక్కో టిప్పర్ రూ.30వేలు మొదలుకొని రూ.40వేల వరకు విక్రయిస్తున్నారు.
జిల్లాలో ఇక్కడి మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇండ్ల నిర్మాణాలు, ఇతర నిర్మాణాలు చేసుకునే వారికి ఇసుక సరైన సమయంలో సరఫరా చేయకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి వ్యాపారులు జీరో దందా కొనసాగిస్తూ జిల్లాలో నిర్మాణదారులకు ఇసుక విక్రయిస్తున్నారు. దీంతో జిల్లా ఇసుక విషయంలో ఆదాయం కోల్పోతుంది. ఈ రెండు రోజుల వ్యవధిలో నాగల్‌దిన్నె మీదుగా గద్వాలకు టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తుండంతో ఈ విష యం రూరల్ పోలీసులకు సమాచారం అందగా వారు అక్కడి వెళ్లి రెండు టిప్పర్లను పట్టుకున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నేత బంధువు పోలీసులకు ఫోన్ చేయడంతో ఒక టిప్పర్‌ను వదిలి వేసి ఒక టిప్పర్‌ను సీజ్ చేసి నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెర, చమన్కాన్దొడ్డి, ముసలంపల్లి ప్రాంతాల్లో ఇసుక డంప్ చేశారు. ఈ ఇసుక ఎవరు డంప్ చేశారనే దానికే కలెక్టర్ సీరియస్ కావడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ అక్రమంగా డంప్ చేసిన ఇసుక డంప్‌లు ఎవరికి, ఎక్కడ నుంచి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారు. ఇసుక మాఫియా వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గట్టు రెవెన్యూ,పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అటవీ ప్రాంతంలో గట్టు, అయిజ రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో ఇసుక డంప్ చేయడం సాధ్యమేనా అనుమానాలు తలెత్తుతున్నాయి. దొరకనంత వరకు దొరలే, దొరికిన తర్వాత అందరూ దొంగలే అన్న చందంగా అక్కడ ఇసుక డంప్‌లు వ్యవహారం ఉంది. ఇసుకకు జిల్లాలో ఎక్కువగా డిమాండ్ ఉండడంతో కర్నూల్‌కు చెందిన వ్యక్తులతో గద్వాలకు చెందిన వ్యక్తులు ఒప్పందం చేసుకొని అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండంతో రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు.
గట్టు మండలంలో సుమారు 10టిప్పర్ల ఇసుక అక్రమ నిల్వల చేయగా దానిపై అధికారులు విచారణ కొనసాగుతుండగా, మరోవైపు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో కేటీదొడ్డి మండలం మైలగడ్డ కాల్వ సమీపంలో అక్రమంగా ఇసుక తీసుకొస్తున్న టిప్ప ర్ డ్రైవర్ ఇది గమనించి రోడ్డు పక్కన ఇసుకను పారబోసి ఖాళీ టిప్పర్‌తో పరారయ్యారు. ఇలా ఇసుక అక్రమ రవాణా జిల్లాలో యథేచ్చగా కొనసాగుతుంది. అధికారులు ఇసుక టిప్పర్లను పట్టుకుంటే ఖద్దర్ నా యకులు ఫోన్ చేయడంతో వాటిని వదిలేయాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేసి నిర్మాణాలు చేపట్టే వారికి ఇసుక సకాలంలో దొరికేలా చర్య లు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారుకోరుతున్నారు.