హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో శానిటేషన్ పనులకు సంబంధించిన బిల్లులను ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఎలుకలు, పాములు, విషపురుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వం సంబంధిత ప్రిన్సిపాళ్లనే బాధ్యులను చేస్తున్నది. దీనిపై గురుకుల ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రతి గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తంగా శాంక్షన్ విద్యార్థుల సంఖ్య 640. పూర్తిస్థాయిలో విద్యార్థులున్న ప్రతి గురుకులంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు స్వీపింగ్ సేవలను అందించే సంస్థలను టెండర్ ద్వారా ఖరారు చేస్తారు.
ఆ సంస్థలు ఒక్కో గురుకులంలో నలుగురు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలి. స్వీపింగ్ సేవలకు ప్రతి నెలా రూ.40 వేల చొప్పున చెల్లించాలి. అందులో రూ.4,500 ఫినాయిల్ తదితర సామగ్రి కొనుగోలుకు వెచ్చించి, మిగిలిన మొత్తంతో సిబ్బంది వేతనాలను చెల్లించాలి. గురుకుల భవనాలు, తరగతి గదులు, డార్మెటరీలు, నీటిట్యాంకులు, మైదానాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఆ సిబ్బంది బాధ్యత.
కానీ, ఈ ఏడాది ఇప్పటికీ పలుచోట్ల స్వీపింగ్ ఏజెన్సీలను ఖరారు చేయలేదు. మరికొన్ని చోట్ల పాత ఏజెన్సీలనే కొనసాగిస్తున్నారు. వీటిలో కొన్ని ఏజెన్సీలకు గత 5 నెలలుగా, మరికొన్ని ఏజెన్సీలకు 8 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆ ఏజెన్సీలు గురుకులాల్లో అరకొర సిబ్బందిని నియమించి, మొక్కుబడిగా శానిటేషన్ పనులు కొనసాగిస్తున్నాయి. కొన్ని గురుకులాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది.
పొదలు పెరిగిపోవడంతో ఎలుకలు, పాములు, ఇతర విషపురుగులు ఏకంగా విద్యార్థుల డార్మిటరీల్లోకి వస్తున్నాయి. పలు గురుకులాల్లో ట్యాంకులను సరిగా శుభ్రం చేయకపోవడంతో తాగునీరు కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేయకపోవడంతో గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తున్నది.
గుత్తేదారులకు సక్రమంగా బిల్లులు విడుదల చేయని ప్రభుత్వం.. గురుకులాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా వాటి సిబ్బందిని బాధ్యులుగా పరిగణించి చర్యలకు ఉపక్రమిస్తున్నది. దీనిపై గురుకుల టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గురుకుల పాఠశాల పక్కనే ఉన్న వ్యవసాయక్షేత్రంలో పురుగుల మందును పిచికారీ చేశారు. దీంతో అక్కడి ఎలుకలన్నీ గురుకులంలోకి ప్రవేశించి, రాత్రివేళ ఆరుగురు విద్యార్థులను కరిచాయి. ఇదేవిధంగా దేవరకద్ర గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురవగా.. నిరుడు జిగిత్యాల జిల్లాలో పాముకాటుకు విద్యార్థి మృతిచెందాడు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటన జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ సర్కార్కు చీమకుట్టినట్టయినా లేదు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో స్వీపింగ్ ఏజెన్సీల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో సర్కార్ తీరుపై గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. గురుకులాల సిబ్బందిని వేధించడం మానుకుని ఇకనైనా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.