Road accident : అమెరికా (USA) లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో తెలంగాణకు చెందిన ఓ మహిళ (Telangana Woman) మృతిచెందారు. ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ఘోరం జరిగిపోయింది. ఆ కారులో ఉన్న తెలంగాణ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరణించిన మహిళను మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా మరిపెడ (Maripeda) మండలానికి చెందిన దారం సుప్రియ (Daram Supriya) గా గుర్తించారు. ఈ ఘటనతో సుప్రియ కుటుంబంలో, మహబూబాబాద్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఉద్యోగరీత్యా అమెరికాలోని మిస్సోరిలో నివసిస్తున్న 31 ఏళ్ల సుప్రియ.. ఇవాళ తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) కారులో వెళ్తున్నారు. అదే సమయంలో వారి వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెతోపాటు కారులో ఉన్న మరో భారతీయ యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కాగా సుప్రియ భర్త కొడుమూరి రంజిత్, అత్తమామలు కొడుమూరి వెంకటేశ్వర్లు, రాధిక మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సుప్రియ మరణ వార్త తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.