Kamal Hassan | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(95) చెన్నైలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.. తన విలక్షణమైన దర్శకత్వ శైలితో, విభిన్న కథాంశాలతో భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సింగీతం.. చివరి రోజుల వరకు సినిమాతో తన అనుబంధాన్ని కొనసాగించారు. సింగీతం శ్రీనివాసరావుతో సుదీర్ఘమైన, ప్రత్యేకమైన అనుబంధం ఉన్న నటుడు కమల్ హాసన్. ఆయన మృతితో కమల్ హాసన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సింగీతం శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. దర్శకుడిగా సింగీతం చేసిన ప్రయోగాలకు, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలకు కమల్ హాసన్ ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇచ్చేవారు.
వీరిద్దరి కలయికలో ఎన్నో మరపురాని చిత్రాలు తెరకెక్కాయి. ‘రాజా పార్వై’, ‘పుష్పక విమానం’, ‘అపూర్వ సగోధరర్గళ్’, ‘మైఖేల్ మదన కామ రాజన్’ వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ సినిమాల విజయంతో పాటు, వీరిద్దరి మధ్య ఏర్పడిన సృజనాత్మక అనుబంధం కూడా ప్రత్యేకంగా నిలిచింది. సింగీతం దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన సినిమాలు కేవలం నటుడిగా ఆయన కెరీర్లోనే కాకుండా భారతీయ సినిమాలో ప్రయోగాత్మక చిత్రాలకు కూడా గుర్తుగా నిలిచాయి. ముఖ్యంగా మాటలు లేకుండా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అప్పట్లోనే ఒక సాహసోపేతమైన ప్రయోగంగా ప్రశంసలు అందుకుంది.ఇటీవల సింగీతం శ్రీనివాసరావు చివరి దర్శకత్వ చిత్రం ‘సింగ్ గీతం’ ప్రీ-రిలీజ్ వేడుకలోనూ వీరిద్దరి అనుబంధం మరోసారి కనిపించింది. ఆ సందర్భంగా కమల్ హాసన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తాను కేవలం 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సింగీతం తనకు ఒక కథ చెప్పారని తెలిపారు. అయితే దశాబ్దాలు గడిచిన తర్వాత ఆ ఆలోచన చివరకు తెరపైకి వచ్చిందని చెప్పారు.
సినిమా పట్ల సింగీతం శ్రీనివాసరావుకు ఉన్న అచంచలమైన ప్రేమకు ‘సింగ్ గీతం’ ఒక నిదర్శనంగా నిలిచింది. 95 ఏళ్ల వయసులోనూ కొత్త కథలు చెప్పాలనే తపనను కొనసాగించిన ఆయన.. చివరి వరకు సృజనాత్మకతకు పెద్దపీట వేశారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’తో పాటు ఎన్నో హాస్య, భావోద్వేగ, ప్రయోగాత్మక చిత్రాలను సింగీతం శ్రీనివాసరావు అందించారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోనుంది. అయితే ఆయన సృష్టించిన అద్భుతమైన సినిమాలు, ముఖ్యంగా కమల్ హాసన్‌తో కలిసి చేసిన చిరస్మరణీయ ప్రయోగాలు.. సింగీతం వారసత్వాన్ని తరతరాల ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉంటాయి.