Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బిస్కెట్ తింటుండగా గొంతులో ఇరుక్కొని ఏడాది వయసున్న బాబు మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట మండలం సుర్తి తండాకు చెందిన మూడవత్ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం రాత్రి పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. తల్లి మౌనిక వారికి బిస్కెట్లు ఇచ్చి వంట చేసేందుకు ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఏడాది వయసున్న పిల్లాడు బిస్కెట్ తింటుండగా అది అనుకోకుండా గొంతులో ఇరుక్కుంది.
గొంతులో బిస్కెట్ అడ్డుపడటంతో చిన్నారి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆటోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఏడాది వయసులోనే బిడ్డను కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.