మహబూబ్‌నగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు.. ఇలా ఊరూవాడా ఎటు చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. విద్యార్థులు వీధుల్లో ప్రభాతభేరి నిర్వహించి భారత్ మాతాకీ జై అని నినాదాలు చేసి దేశభక్తిని చాటారు.

వేడుకల్లో మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జోగుళాంబ గద్వాలలో ప్రభుత్వ సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి, వనపర్తిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై జెండావిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అలాగే మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల, అలంపూర్‌లో ఎమ్మెల్యే విజయుడు, మక్తల్, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వనపర్తిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో తెలంగాణ ఉద్యమకారుడు టీజీ మహేశ్ తన సొంత ఖర్చులతో తయారు చేయించిన 500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. వనపర్తిలో 100 మీటర్ల జెండాతో ప్రైవేటు స్కూల్, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కలుగొట్లలో 200 మీటర్ల జాతీయ జెండాను విద్యార్థులు ఊరేగించారు.