ఊట్కూర్, జనవరి 4 : కర్ణాటక-తెలంగాణ సరిహద్దు పెద్దవాగు శివారులో ఇసుక పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలోని ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి మైనింగ్, రెవె న్యూ శాఖ ఆధ్వర్యంలో ఇసుకను తరలించేందుకు నాలుగేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌కు అనుమతులు జారీ చేసింది. ఇక్కడి నుంచి అనుమతులు పొందిన ట్రాక్టర్లతో ఆన్లైన్ బుకింగ్ ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాలకు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఇసుకను తరలిస్తున్నారు. ప్రారంభంలో సరిహద్దులోని నాగిరెడ్డిపల్లి, కర్ణాటక రాష్ట్రం చేలేరు గ్రామాల ప్రజలు వాగు తమ పరిధిలో ఉందటే..కాదు కాదు తమ పరిధిలోకి వస్తుందని ఘర్షణ పడడంతో ఇరు రాష్ర్టాలకు చెందిన అధికారులు సర్ది చెప్పారు.
ఇరు రాష్ర్టాలకు చెందిన అధికారుల ప్రమేయంతో అప్పట్లో వివాదం సద్గుమణిగింది. కొన్నాళ్లు ఆన్లైన్ ద్వారా ఇసుక రవాణా సాఫీగా జరిగినప్పటికి తాజాగా ఆదివారం కర్ణాటక శివారులోని నదీ పరివాహక ప్రాంతానికి చెందిన చేలేరు గ్రామస్తులు బార్డర్ దాటి తమ పరిధి నుంచి ఇసుకను తరలిస్తున్నారని కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో కర్ణాటకకు చెందిన పలువురు అధికారులు, పోలీసులు రీచ్ వద్ద కు చేరుకుని ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. విష యం తెలుసుకున్న తాసీల్దార్ రవి, ఎస్సై రమేశ్ స్థానిక పోలీసులతో రీచ్ వద్దకు చేరుకుని కర్ణాటక పోలీసులతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో పెద్ద వాగు హద్దులు సరి చూసేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలకు సర్దిచెప్పి శాంతింపజేశారు. కాగా ఇసుకను తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లనుపోలీసులు ఠాణాకు తరలించారు.