చారకొండ, ఫిబ్రవరి 7 : బైపాస్ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని పేదలకు చెందిన ఇండ్లను పోలీసుల సాయంతో ఉన్నట్టుండి నేలమట్టం చేయడంతో బాధితుల బాధలు చెప్పుకోలేనివిగా మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చారకొండ-మర్రిపల్లి వరకు రెండు కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపడుతున్న బైపాస్ రోడ్డు పేదలకు శాపంగా మారింది. బైపాస్ రహదారికి అడ్డంగా ఉన్నాయని పేదలకు చెంది న 29 ఇండ్లు అధికారులు, పోలీసుల తెల్లవారుజాముననే గ్రామాలకు చేరుకొని కష్టపడి నిర్మించుకున్న ఇండ్ల ను నేలమట్టం చేశారు. దీంతో మర్రిపల్లికి చెందిన నూనె విష్ణుకు బైపాస్‌లో నిర్మాణంలో తనకున్న 262 గజాల్లో నిర్మించుకున్న ఇండ్లను కూల్చేశారు. పరిహారం తీసుకోకుండానే ఇండ్లు పూర్తిగా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉండటానికి జాగ లేకపోవడంతో బైపాస్ సమీపంలోనే ఓ చెట్టు కింద గుడిసె వేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో అక్కడే వంట చేసుకొని ఉంటున్నారు.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణం గురించి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా బంధవు చనిపోతే ఊరికి వెళ్లి వచ్చేసరికి మా ఇంటిని పోలీసుల పర్యవేక్షణలో అధికారులు కూల్చేశారు. మా సామన్లు తీసుకుంటామంటే కూడా తీయనివ్వకుండా వాళ్లే తీసుకెళ్లి ఓ గోదాంలో పడేశారు. తీసుకెళ్లిన సామన్లు కూడా ఇవ్వలేదు. వేసుకోవడానికి బట్టలు, వండుకోవడానికి వంట సామన్లు లేవు. మా ఇండ్లు కూ ల్చి అధికారులు పైశాచిక ఆనందం పొందా రు. ఇంటి స్థలంతోపాటు ఇండ్లు నిర్మించి పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – నూనె విష్ణు, మర్రిపల్లి, చారకొండ మండలం