మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఆగస్టు 31 : మహబూబ్‌నగర్ పురపాలిక పరిధిలోని క్రిస్టియన్‌పల్లి సర్వే నెంబర్ 523 లో ఈనెల 28న అర్ధరాత్రి సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా పేదల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేసిన విషయంలో దివ్యాంగులు, దళితులు, నిరుపేదలకు న్యాయం చేస్తారా? సమస్యకు పరిష్కారం చూపకుండా నాన్చుతారా? అనేది ఉమ్మడి పాలమూరుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చి అదే ప్రభు త్వం అక్కడ కట్టుకున్న ఇండ్లను కూలగొట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. నోటీసులు లేకుండా ఇల్లు కూలగొట్టాలని చట్టంలో ఎక్కడా లేదు. కానీ అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా ఇండ్లను కూలగొట్టారని బాధితులు వాపోతున్నారు. డబ్బు, పరపతి ఉండే వారికి నోటీసులు ఇచ్చి సమయం ఇస్తున్న అధికారులు పేదల విషయంలో అలా ఎందుకు వ్యవహరించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యగా పలు సంఘాలు అభివర్ణిస్తున్నాయి. పట్టాలు నిజమైనవి కాకపోతే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అంతేకానీ రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న వారి ఇండ్లను కూలగొట్టడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సర్వే నెంబరు 523 బాధితుల పక్షాన ఉంటూ.. నిరాశ్రయులైన వారికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఈ నెల 29, 30 రెండు రోజులపాటు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు కూలగొట్టిన ప్రాంతంలోనే ఇండ్లు నిర్మాణం చేయడంతోపాటు నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక వసతి సౌకర్యం కల్పించాలని, పేద ప్రజలకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
రెండు రోజులుగా బాధితుల ఆందోళన, నిరసనల నేపథ్యం లో రెండు రోజుల అనంతరం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి నిరాశ్రయులకు పునరావాసం కల్పిస్తామని ఈ నెల 30 రాత్రి బాధితులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇ చ్చే ఇందిరమ్మ ఇండ్ల పథకాలలో మీకు ప్రాధాన్యం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నిరాశ్రయులకు అల్మాస్ ఫంక్షన్హాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా.. శుక్రవారం దుప్పట్లు అం దించి ఒక పూట భోజనం పెట్టించారు. శనివారం పునరావాస కేంద్రంలో ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న దివ్యాంగులు, నిరుపేదలు ఈ కేంద్రానికి చేరుకోలేదు. తమకు తెలిసిన వారి ఇండ్లల్లో, సమీప బంధువుల ఇండ్లల్లో తలదాచుకున్నారు.
కళ్లు కన్పించని, కాళ్లు లేని, చెవులు వినపడని, నడవలేని దీన దుస్థితిలో ఉన్న దివ్యాంగులు మాత్రమే సర్వే నెంబర్ 523 క్రిస్టియన్‌పల్లి ఆదర్శనగర్ ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకున్నారని బ్లైండ్లేమ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అం టుండగా.. అధికారులు మాత్రం అక్కడ చాలా వరకు నకిలీ, బోగస్ పట్టాదారులు ఇండ్ల నిర్మాణాల పేరిట ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉం డగా మరికొందరు మధ్యవర్తుల ద్వారా భూమి పట్టాలు కొనుగోలు చేసి తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల మ ద్దతుతో కొందరు దళారులు, మధ్యవర్తులు కలిపి భూ మాఫీయగా ఏర్పడి ప్రభుత్వ భూమి క్రయవిక్రయాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.