వనపర్తి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది వ్యవసాయ సీజన్లో కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. గతంలో ఎప్పుడూ లేనంతంగా ఈ సంవత్సరం ఊహించని విధంగా వరదలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ మేరకు దాదాపు 4నెలల పాటు కృష్ణానది పొంగి పొర్లుతున్నది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో మొదటి ప్రాజెక్టుగా ఉన్న జూరాల, ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో మురిసిపోతుంది. మళ్లీ 20 ఏండ్ల తర్వాత అంతటి నీటి ప్రవాహాన్ని చూస్తున్న జూరాల ప్రాజెక్టు ఇప్పటి వరకు ఉన్న వరదల రికార్డును బ్రేక్ చేస్తుంది.
ఇదిలా ఉంటే, భీమా ఉపనది సహితం ఈ ఏడాది వరద ప్రవాహంతో మురిపిస్తుంది. వెరసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నదులు, ఉపనదులు, వాగులు, వంకలు ఎక్కడ చూసినా నీటితో తొణికిసలాడుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు జూరాల ప్రాజెక్టు మూలాధారం. 1995లో వినియోగంలోకి వచ్చిన ప్రియదర్శిని జూరాల 67 రేడియల్ గేట్లతో ఏర్పాటైంది. 11.94 టీఎంసీల కెపాసిటీతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసినా క్రమంగా కేవలం 9.65 టీఎంసీల వరకే నీటి నిలువ కొనసాగుతుంది.
జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్షా 5వేల ఎకరాల ఆయకట్టు ఉంటే, భీమా, కేఎల్ఐ, కోయిల్‌సాగర్, నెట్టెంపాడ్ ప్రాజెక్టుల ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల ఆధారంతో మరో పది లక్షల ఎకరాలకుపైగా సాగును వినియోగంలోకి తెచ్చింది. అప్పటి నుంచి జూరాల ప్రాజెక్టుకు ప్రాముఖ్యత పెరిగింది. కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు కంటే పదింతలు అధికంగా ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా సాగు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, కేఎల్ఐ, భీమా-2లో ఎత్తిపోతల పథకాల్లోనే 750 వరకు చెరువులు నింపుకొనే వెసులు బాటును బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది.
ఈ వానకాల సీజన్ నుంచి అక్టోబర్ 1 బుధవారం వరకు 1371 టీఎంసీల నీటిని జూరాల నుంచి దిగువకు విడుదల చేశారు. కర్ణాటక ఎగువ ప్రాంతంలోని డ్యాంల నుంచి వరద వచ్చినప్పుడల్లా కిందకు పంపిస్తున్నారు. అయితే, ఈ ఏడా ది మే 29నుంచి జూరాలకు ఇన్‌ప్లో మొదలు కావడంతో అదేరోజు 85 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చే యడం ప్రారంభించారు.
అలా మొదలైన వరద క్రమంగా పెరుగుతూ వచ్చింది. నాటి నుంచి నేటి వరకు దాదాపు 120 రోజులపాటు జూరాల నుంచి వరద నీరు దిగువకు శ్రీశైలం వైపు పరుగులు పెడుతూనే ఉన్నది. బుధవారం సాయ ంత్రం 6 గంటలకు 20 గేట్ల ద్వారా 3,20,595 క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు విడుదలవుతు న్నది. ఇలా వెళ్లిన వరద నీరు మొత్తంగా ఈ సీజన్ వారీగా చూస్తే.. 1371.81 టీఎంసీలు కృష్ణార్పణం అయ్యాయి.
2005లో వచ్చిన వరదల కారణంగా అప్పట్లో జూరాలకు భారీగానే నీటి ప్రవాహం వచ్చింది. ఆ వరదల్లో జూరాల నుంచి దిగువకు దాదాపు 1600 టీఎంసీల నీటిని దిగువకు వదిలినట్లు రికార్డులున్నాయి. మళ్లీ ఈ రెండు దశాబ్దాల కా లంలో అప్పుడప్పుడు భారీ వర్షాలు, వాయిగుండాల ద్వా రా వరదలు వచ్చినప్పటికీ ఇంత భారీస్థాయిలో జూరాలకు వరద రాలేదు. ఇరవై ఏండ్ల కిందట వచ్చిన వరదల సునామీని మించి మళ్లీ ఇప్పుడు జూరాలకు నీటి తాకిడి ఉన్నది.
పరిస్థితిని చూస్తే.. ఇంకా వరదలు తగ్గు ముఖం పట్టి నట్లుగా కనిపించడం లేదు.. వర్షాలు పడుతూనే ఉన్నా యి. వాయుగుండాల ప్రభావం వెంటాడు తూనే ఉన్నది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జూరాల చరిత్రలో ఒ క వర్షాకాల సీజన్ లో రికార్డు బ్రేక్‌గా ఉన్న 1600 టీఎంసీలను కూడా ఈ ఏడాది అ ధిగమించే అవకాశం కనిపిస్తుంది. వారం రోజులకు పైబడి లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు పంపి స్తూనే ఉ న్నారు. ఇదే వరద ప్రవాహం మరో వారం రో జుల వరకు జూరాలకు పోటెత్తుందన్న అంచనాను ఇరిగేషన్ అధికా రులు వేస్తున్నారు.
ఇరవై ఏండ్ల కిందట కృష్ణానదికి 2005లో భారీగా వరదలు వచ్చాయి. అప్పట్లో జూరాల ప్రాజెక్టుకు వరదలు పోటెత్తాయి. అప్పట్లో 1600 టీఎంసీల నీరు దిగువకు విడుదలైంది. సుదీర్ఘకాలం అనంతరం మళ్లీ ఇప్పుడు అదేస్థాయిలో వరద పోటెత్తుతున్నది. ఇప్పటి వరకు ఈ వర్షాకాల సీజన్లో 1371 టీఎంసీలకు పైగా వరద నీరు దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్లింది. మరి కొద్ది రోజులు వరద వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
– జుబేద్, ఈఈ, జూరాల డ్యాం