ధరూరు/అయిజ, అక్టోబర్ 6 : జూరాల ప్రాజెక్ట్‌కు వరద నిలకడగా కొనసాగుతున్నది. ఆదివారం ప్రాజెక్ట్‌కు ఎగువ నుం చి 61 వేల క్యూసెక్కుల వరద రాగా.. మూడు గేట్లను ఎత్తి 21,630 క్యూసెక్కులను దిగువకు వదిలారు. విద్యుదుత్పత్తికి 37,252, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, భీమా లిఫ్ట్-2కు 750, ఎడమ కాల్వకు 1,140, కుడి కాల్వకు 730, సమాంతర కాల్వకు 300 క్యూసెక్కులను విడుదల చేశారు.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.439 టీఎంసీల నిల్వ ఉన్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 14,733, అవుట్‌ఫ్లో 14,422 క్యూసెక్కులుగా నమోదుకాగా.. ప్రస్తుతం 101.773 టీఎంసీల నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 41,318, అవుట్‌ఫ్లో 40,675 క్యూసెక్కులుగా ఉన్నది.
ఆయకట్టుకు 643 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.7 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నది. అలాగే ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 21,010, అవుట్‌ఫ్లో 21,010 క్యూసెక్కులుగా నమోదుకాగా.. ప్రస్తుతం 128.19 టీఎంసీల నిల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 19,021, అవుట్‌ఫ్లో 15,600 క్యూసెక్కులుగా నమోదుకాగా.. ప్రస్తుతం 37.61 టీఎంసీల నిల్వ ఉన్నది.