కల్వకుర్తి, ఏప్రిల్ 3 : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లూటీ లేదా లాఠీ పాలన నడుస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన అంటేనే అంతా ఆగమాగం ఉంటుందని, రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పాలన ఒకటిన్నర సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండలంలో హరీశ్‌రావు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోళి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల వెంకటేశ్‌తో కలిసి మాజీ మంత్రి కడ్తాల మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు, మర్రిపల్లి, ఏక్వాయిపల్లి, మద్విన్ గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ, ముద్విన్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు దశరథ్‌నాయక్ పేద కుటుంబానికి కట్టించిన ఇండ్లను ప్రారంభించారు.
బోయిన్గట్టు తండాలో సంత్ సేవాలాల్, మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. గిరిజనులకు రిజర్వేషన్ 10 శాతం పెంచింది, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఎన్నో హమీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం కనీసం గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పరిపాలనలో సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి ఇచ్చి న విషయాన్ని గుర్తు చేశారు. అబద్ధాలకు రేవంత్‌రెడ్డి బ్రాం డ్ అంబాసిడర్ అని ముఖ్యమంత్రి కుర్చిలో కూ ర్చున్న ఆయన ప్రజలకు ఉపయోగ పడే నాలుగు మంచి మాట లు మాట్లాడాకుండా, బూతు మాటలు, బెదిరింపు మాట లు మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవుండ్లపైన ఓట్లు వేసి దేవుళ్లనే మోసం చేసిన రేవంత్‌రెడ్డికి ప్రజలు ఒక లెక్కా అని అన్నారు. సంవత్సరంన్నర కాలంలో రేవం త్ సాధించింది శూన్యమని, అన్ని ఆగమాగం, సగం సగం పనులేనని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ సగం సగం, వానకాలం రైతు బంధుకు ఎగనామం, యాసంగి రైతు బంధు సగం సగం.. ఇలా అంతా రేవంత్ పాలన భ్రమగా మారిందని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర జీడీపీ పెరిగితే.. రేవంత్ పాలనలో గుండాయిజం పెరిగిందని, కేసీఆర్ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పెరిగితే.. రేవంత్ పాలనలో ఆలయ కుటుంబ సభ్యుల ఆదాయం పెరిగిందని ఆరోపించారు.
పేదల భూములు కొల్లగొట్టడంలో రేవంత్‌కు మాస్టర్ డిగ్రీ ఉందని, ఇప్పటికే అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని లాక్కున్నాడని, ఇప్పుడు హెచ్‌సీయూ భూములు 400 ఎకరాలు కొల్లగొట్టేందుకు విద్యార్థులపై దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. విద్యార్థులపై కేసులు పెట్టించిన రేవంత్‌కు విద్యార్థులు ఉసురు ముడుతుందని హరీశ్ అన్నారు. బీసీల రిజర్వేషర్ పెంపుపై కపట ప్రేమతో ఢిల్లీలో చేసిన రేవంత్ దీక్షకు రాహూల్‌గాంధీ ఎగ్గొట్టాడని. రాహూల్నే ఒప్పించేలేని ఈ పనిమంతుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాడా అంటూ రేవంత్‌పై సైటైర్లు విసిరారు.
ఇప్పటికే రెండు జాతీయ రహదారులు, ట్రిపుల్ఆర్, పార్మాసిటీ రోడ్డు ఉండగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఎవరి కోసం వేస్తున్నారని, పేదల భూములు 1200 ఎకరాలు ఎందుకు గుంజుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి పేరిట భూములు గుంజుకోవడం వెనుక పెద్ద కుట్ర దాడి ఉందనే అనుమానాలనే వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి ధైర్యం ఉంటే.. నల్లమల బిడ్డనని చెప్పుకునే ఆయన పోలీసు బందోబస్తు లేకుండా బోయిన్‌గుట్ట తం డాకు వచ్చి అందరికీ రుణమాఫీ అయిందని నిరూపించాలని సవాల్ విసిరారు. అందరికీ రుణమాఫీ చేసినట్లు ని రూపిస్తే పూలతో సన్మానం చేస్తామని లేని పక్షంలో గిరిజనులు ఏవిధంగా సన్మానం చేసినా ఓర్చుకోవాలని రేవంత్‌ను ఉద్దేశించి హరీశ్ పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టిన రేవంత్‌కు కూల్చుడు తప్పా కట్టుడు తెలియదని విమర్శించారు.
రాష్ర్టానికి కేసీఆర్ శ్రీరామరక్ష.. కేసీఆర్‌ను కాపాడుకుంటే.. కేసీఆర్ మనందరిని, రాష్ర్టాన్ని కాపాడుతారని అన్నారు. మోసం మాటలు నమ్మి మోసపోయాం.. మరో సారి మోసపోకుండా నీళ్లు ఏవో..పాలు ఏవో గ్రహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.