వనపర్తి, ఏప్రిల్ 9 : రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాఘవ సంస్థను, తన కొడుకును ఈ ఉచ్చులో నుంచి కాపాడుకోవాలన్న తాపత్రయం స్పష్ట ంగా బయటపడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శాసనసభలో సీఎంతోపాటు మైనింగ్ మంత్రి, రాఘవ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడినప్పుడు పొంగులేటి ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు. గురువారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. అంబేద్కర్ సచివాలయంలో పొగరులేటి (పొంగులేటి) మాటలు విన్నాం.. ఒకవైపు అంబేద్కర్, మరొక వైపు ఆలయం, మసీదు ఉండగా నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడారని హరీశ్‌రావు అన్నారు.
తన సంస్థను కాపాడుకొని బయట పడాలనే తాపత్రయం స్పష్టంగా కనిపించిందని, తానొక్కడే కాదని ఇతర మంత్రులు జూపల్లి, మల్లు భట్టి విక్రమార్కలు కూడా భాగస్వాములని పొంగులేటి స్వయంగా బయట పెట్టారని పేర్కొనారు. ఆయన పొంగులేటి కాదు పొంగులూటీ అని పునర్ ఉద్ఘాటించారు. శాసనసభలో రాఘవ కన్స్ట్రక్షన్ క్రషర్ గురించి సీఎం మాట్లాడుతూ మా అధికారులు గుర్తు పట్టారు ఫెనాల్టీ వేశాం అని శాసనసభలో చెప్పారు. మైనింగ్ మంత్రి, రెవెన్యూ, విద్యుత్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పలుసార్లు వెల్లడించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. రాఘవ క్రషర్కు ఇచ్చిన నోటీసులు తప్పా..? లేక బాంబులేటి పొగరులేటి చెప్పింది తప్పా..? అని తేల్చుకోవాలన్నారు.
శాసనసభలో రాఘవ కన్స్ట్రక్షన్ మీద రాద్ధాంతం జరిగినప్పుడు, అసెంబ్లీలోనే ఉన్న నీవు మౌనమెందుకు దాల్చావన్నారు ఆయన ప్రశ్నించారు. మైనింగ్ నీది కాకపోతే అక్కడ కాంగ్రెస్ జెండా, కంటైనర్ మీద మీ పేరు ఎందుకు ఉంటుందని అన్నారు. మైనింగ్‌శాఖ నోటీసులు ఇస్తే నీ అధికారి సంతకం పెట్టింది నిజం కాదా, అదే కదా నేను అసెంబ్లీలో చూపించిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ అని దొంగ లెక్కలు చెబుతున్నారు. 2016లో భూములను నిషేధిత జాబితాలో పెట్టి కాపాడింది బీఆర్ఎస్ పార్టీయే అని గుర్తు చేశారు. కంపెనీలు హైకోర్టుకు, డివిజన్ బెంచీలకు పోయిన సందర్భంలోనూ ఈ భూములు సీలింగ్ భూములను అని తీర్పు వచ్చిందన్నారు.
ఈ భూములు ప్రభుత్వ భూములని సుప్రీం కోర్టులో వేసాం అని చెబుతున్న మీరు రోజుకొక పేరుతో కోహినూర్, శిల్ప, ఆక్వాషూర్ బోర్డులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూమిగా గుర్తించినప్పుడు రెండున్నరేండ్లు అయినా హైడ్రాకు ఎందుకు కనిపించడం లేదు, హైడ్రా ఎక్కడికి పోయింది, రాత్రుళ్లు పేదల ఇండ్లు కూల్చోచ్చు కానీ ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి అయితే హైడ్రాను పంపించి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 4 శాఖల అధికారులు చెప్పారు కదా.. వాళ్లది తప్పు అయితే వాళ్ల మీద యాక్షన్ తీసుకోవాలన్నారు.
సీఎం, మైనింగ్ మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు పొంగులేటి క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్యయాదవ్, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్‌యాదవ్, వాకిటి శ్రీధర్, నాగం తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.