అలంపూర్, జూలై 31 : రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ, పర్యవేక్షణలోపం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు. సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఆహారం కలుషితమైన సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో రేవంత్‌రెడ్డి పాలనలో గురుకులాల్లో విద్యార్థులకు సీటు వచ్చినప్పటికీ వద్దని విద్యార్థుల తల్లిదండ్రులు క్యాన్సల్ చేసుకునే పరిస్థితులు దాపురించాయి. కేసీఆర్ పదేండ్ల కాలంలో కార్పొరేట్ స్థాయిలో అందిన విద్యపై నేడు నీలినీడలు కమ్ముకున్నాయి.
టాయిలెట్లు, తాగునీటికి ఇక్కట్లే..
అలంపూర్ చౌరస్తాలోని బీసీ గురుకుల పాఠశాల సమస్యలకు కేరాఫ్‌గా మారింది. ప్రధానంగా తాగునీటి, టాయిలెట్లు సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. దీంతో విద్యార్థులు ఒకటికి.. రెంటికి.. బయటకు వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నెలల తరబడి గురుకులంలో సమస్యలు తిష్టవేశాయి. అరకొర వసతులతో వేసారిన విద్యార్థులు నిరసనగా తరగతులు వదిలి పాదయాత్రకు దిగారు.
దాదాపు 7 కిలోమీటర్ల వరకు 60 మంది విద్యార్థులు కాలినడకన గద్వాల కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెలల తరబడి కన్నెత్తి చూడని అధికారులు రెండు గంటల్లోనే గురుకులానికి చేరుకొని విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారి సమస్యలను నోట్ చేసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు.
సిబ్బందికి తెలిసే..
సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు చేపట్టిన పాదయాత్ర గురించి గురుకుల పాఠశాల సిబ్బందికి ముందే తెలుసన్న గుసగుసలు వినబడుతున్నాయి. కొన్ని నెలలుగా సమస్యలను అధికారుల దృష్టికి, భ వన యజమాని దృష్టికి తీసుకెళ్లినా.. పట్టింపు లేకపోవడం వల్లే.. చూడలేని సిబ్బంది విద్యార్థులకు సహకరించి ఉంటారనే వాదనలు ఉన్నాయి. ఒక్క వి ద్యార్థి కూడా గేటు దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేని సమయంలో ఏకంగా 60 మంది విద్యార్థులు పాఠశాల విడిచి పాదయాత్ర చేపట్టారంటే.. సిబ్బందికి తె లియకుండా ఉండదని పలువురు చెవి కొరుక్కుంటున్నారు. కాగా కలెక్టర్ సంతోష్ గురువారం గురుకుల పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో వేర్వేరుగా మాట్లాడి సమస్యలన్నీ ఆలకించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై వేటు వేశారు. ఇంత వరకు వచ్చే వరకు ఎందుకు పట్టించుకోలేదని సీరియస్ అయ్యారు. అనుమతుల్లేకుం డా రోడ్డెక్కిన విద్యార్థులను సున్నితంగా మందలించారు. విద్యార్థుల భద్రత మాకు ముఖ్యమని వివరించారు.
ఒంటికీ.. రెంటికీ..ఆరు బయటకే..
అలంపూర్ చౌరస్తా, జూలై 31 : పే ద విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గురుకుల పా ఠశాలలను ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేసింది. దీంతో గురుకులాల్లో చదువుతున్న వి ద్యార్థు లు వివిధ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మాజ్యోతిరావుఫూలే బా లుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు తాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడంతో నాసిరకమైన పురుగుల అన్నంతో రోజూ సతమవుతున్నా రు. ముఖ్యంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఒంటికి, రెంటికీ ఆరుబయట కు వెళ్తున్నారు. డైనింగ్‌హాల్ లేకపోవడంతో నేలపైనే కూర్చొని భోజనం చే యాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు అధికారుల..సస్పెన్షన్
అలంపూర్ చౌరస్తా, జూలై 31 : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విధులపై నిర్లక్ష్యం చేశారని ఇద్దరు అధికారులను కలెక్టర్ సంతోష్ సస్పెండ్ చేయడం జిల్లాలో చర్చనీయంగా మారింది. బుధవారం మ హాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలో వసతులు లేని విద్యార్థులు రోడ్డెక్కడంతో గురువారం కలెక్టర్ అలంపూర్ చౌరస్తాలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ప్రిన్స్‌పాల్, వార్డెన్, హౌస్ మాస్టర్‌కు మెమో జారీ చేశారు. మొదట ఆయన పాఠశాలలోని గదులను, మరుగుదొడ్లను పరిశీలించి పాఠశాలలో సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులు సమస్యలపై రోడ్డెక్కే ప్రయాత్నా లు ప్రమాదాలకు దారితీసే అవకాశముందని, అలాం టి పరిస్థితులు మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో తలెత్తకూడదని అధికారులను అదేశించారు.
విద్యార్థులపై బెదిరింపులకు పాల్పపడుతున్న పాఠశాల భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో కొత్త మరుగుదొడ్లు, బాత్రూంలు నిర్మించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వి ద్యార్థులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహా రం అందించాలని, నాణ్యతలేని బియ్యాన్ని పంపించి మంచి బియ్యన్ని తెప్పించుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మినరల్ వాటర్‌ను అందించాలని తెలిపారు. అనంతరం కలుగోట్ల కస్తూర్బాను పరిశీలించి పాముకాటుకు గురైన విద్యార్థి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. రిజిస్టర్లు, భోజనాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జి ల్లా కోఆర్డినేటర్ అనీలకుమారి, రామకృష్ణ, ఎస్సై శే ఖర్ తదితరులు ఉన్నారు.
సమస్యలతో విసిగిపోయాం..
గురుకులంలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా రోజులుగా అధికారులకు చెబుతున్నప్పటికీ పరిష్కరించడం లేదు. ఉన్న నాలుగు బాత్రూంలు పని చేయక తాళాలు వేయడంతో ఒకటి రెంటికి పొలాల్లోకి వెళ్లవలసి వస్తోంది. సరిపడా తరగతి గదులు లేవు, తాగునీటి సమస్య ఉంది. స్నానాలకు, బట్టలు ఉతుక్కోవడానికి ఉప్పు నీళ్లతో ఇబ్బంది పడాల్సి వస్తోంది.
-రాకేశ్, గురుకుల విద్యార్థి
పరిష్కారం కావడం లేదు..
గురుకులాల్లో సమస్యలు సకాలంలో పరిష్కరించబడటం లేదు. అధికారులు వస్తారు, తెలుసుకుంటారు వెళ్తారు, సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. బిల్డింగ్ ఓనర్‌ను అడిగితే గొడవకు దిగుతున్నాడు, గత కొద్ది రోజుల కిందట విద్యార్థిపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. సమస్యలు పరిష్కారం అయితే రోడ్డెక్కాల్సిన అవసరం ఏముంటది.
-తిరుమలేశ్, గురుకుల విద్యార్థి
బియ్యం మార్చాలని అడుగలేదు..
స్టాక్ పాయింట్ నుంచి గురుకుల పాఠశాలకు మంచి బియ్యమే పంపిణీ చేశాం. ప్రతి నెలా చెక్ చేసి తీసుకుపోతారు. బియ్యం బాగా లేవని గాని, వెనక్కి తీసుకుని వేరే బియ్యం ఇవ్వాలని ఎవరు అడుగలేదు. ఎక్కడా బియ్యం బాగా లేవని కైంప్లెంట్ రాలేదు. – రవీందర్‌రెడ్డి, అలంపూర్ స్టాక్ పాయింట్ ఇన్చార్జ్