గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 284 కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 87,020 మందికిగానూ 73,333 మంది అభ్యర్థులు, అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ఎగ్జామ్‌కు 87,020 మందికిగానూ 74,258 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సీసీ కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షను కట్టుదిట్టంగా జరిపారు. ఆలస్యంగా వచ్చిన వారిని కేంద్రంలోకి అనుమతించ లేదు. కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు తనిఖీలు చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు, ఎస్పీలు తనిఖీ చేసి పరీక్ష తీరును పరిశీలించారు. అభ్యర్థుల హాల్‌టికెట్లను సిబ్బంది పరిశీలించిన తరువాతే కేంద్రాల్లోకి అనుమతించారు. పాలమూరు జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలకు సంబంధించిన అడ్రస్ తెలియని అభ్యర్థులకు రక్షకభటులు సహాయం చేశారు. కొంతమంది మహిళా అభ్యర్థులు తమ చిన్నారులను వెంటపెట్టుకుని పరీక్ష రాసేందుకు వచ్చారు. నాగర్‌కర్నూల్‌లో దివ్యాంగుడికి సహాయంగా ఓ విద్యార్థిని పరీక్ష రాసేందుకు రాగా.. కలెక్టర్ ఉదయ్‌కుమార్ పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను తీసివేసిన తరువాతే లోపలికి పంపగా.. మరికొన్ని చోట్ల బెల్ట్‌లు సైతం తీయించడం కనిపించింది.
నాగర్‌కర్నూల్, జూలై 1: నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రూప్-4 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని 50 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 85శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టర్ ఉదయ్‌కుమార్ వెల్లడించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 16,632 మందికిగానూ 14,126 మంది హాజరు కాగా, 2,506 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 16,632 మంది అభ్యర్థులకుగానూ 14,094 మంది అభ్యర్థులు హాజరు కాగా, 2,538 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ కలెక్టరేట్ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్నాపత్రాలను 14 రూట్ల ద్వారా 50 పరీక్షా కేంద్రాలను పటిష్ట భద్రత మధ్య ప్రశ్నాపత్రాలను తరలించే ప్రక్రియను పర్యవేక్షించారు.
వనపర్తి, జూలై 1: వనపర్తి జిల్లాలో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా మొత్తంగా 46 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 85శాతం మంది హాజరయ్యారన్నారు. మొత్తం 13,684 మందికి గానూ పేపర్ 1కు 11,725 మంది.. పేపర్-2కు 11,863 మంది హాజరైనట్లు వివరించారు.
గద్వాల, జూలై 1 : తెలంగాణ రాష్ట్రపబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా శనివారం నిర్వహించిన గ్రూప్-4 మొదటి సెషన్లో 14,920 మంది అభ్యర్థుల్లో 12,580 మంది పరీక్ష రాయగా.. 2,340మంది గైర్హాజరైనట్లు (84.32) అధికారులు తెలిపారు. రెండో సెషన్లో 12,522 మంది పరీక్ష రాయగా.. 2,398మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా పరీక్షలకు 83.93 శాతం హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీ చేశారు.
పాలమూరు, జూలై 1: పాలమూరు జిల్లాలో గ్రూప్-4 పరీక్షలకు 85.73శాతం అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టర్ రవినాయక్ వెల్లడించారు. 111 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 34,459 మందికి గానూ ఉదయం నిర్వహించిన పరీక్షకు 29,546 మంది (85.73శాతం) అభ్యర్థులు హాజరు కాగా, 4,913 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 29,429 మంది హాజరు కాగా.. 5,030 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రవినాయక్ తనిఖీ చేశారు.
నారాయణపేట రూరల్ జూలై 1 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్షలకు 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ మయాంక్‌మిట్టల్ పేర్కొన్నారు. మొత్తం 7,325 మంది అభ్యర్థులకు గానూ ఉదయం 6,356 మంది పరీక్ష రాయగా.. 969 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు.మధ్యాహ్నం 7325 మందికి గానూ 6350 మంది హాజరుకాగా 975 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని లిటిల్‌స్టార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీసాయి, సరస్వతీ శిశుమందిర్, కాకతీయ హైస్కూల్లోని పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ మయాంక్‌మిట్టల్ సందర్శించారు. గ్రౌండ్ స్కూల్, రవితేజ, సీఎన్ఆర్ డిగ్రీ, సోషల్ వెల్ఫేర్ కళాశాల వద్ద పోలీస్ బందోబస్తును ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.