దేవరకద్ర/జడ్చర్ల/అయిజ, ఏప్రిల్ 10 : ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు సాగుచేసిన వరిపంటలు నేలకొరిగాయి. గురువారం మార్కెట్‌యార్డుకు 1,871 క్వింటాళ్ల ధాన్యం రావడంతో తూకం చేసిన దాదాపు 1000 బస్తాల ధాన్యం తడిసిపోయింది. జడ్చర్ల మండలంలో ఉరుములు, మెరుపుతలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన పంటలు నేలకొరిగాయి.
జడ్చర్ల-మిడ్జిల్ మధ్య ప్రధాన రహదారిపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. జడ్చర్ల ఫ్లై ఓవర్ కింద ట్రాఫిక్ జామ్ అయ్యింది. జడ్చర్ల మండలంలో 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. అయిజ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలో ఈదురుగాలులకు చెట్టు నేలకొరిగింది. దీంతో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర సమీపంలో పిడుగుపాటుకు చెట్టు కాలిపోయింది. అలాగే పలు గ్రామాల్లో పంట లు నేలకొరిగాయి.