నవాబ్‌పేట, మే 18 : మండల కేంద్రంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులోని వరిధాన్యం తడిసి అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో టెండర్లు నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుకు వరిధాన్యం తీసుకొచ్చారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని కుప్పలు పోయగా, మరికొందరు యార్డులో ఆరబోశారు. సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయ్యింది. కొంత మంది రైతుల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. యార్డులోనూ కుప్పలుగా పోసిన ధాన్యం కొంతభాగం తడిసింది.
నిండా మునిగిన రైతులు
రాజోళి, మే 18 : అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. రాజోళి మండలంలోని మాన్‌దొడ్డి, పెద్ద ధన్వాడలో కొనుగోలుకు తీసుకొచ్చిన 3,500 వరి ధాన్యం, రాజోళిలో 1,500 సంచుల జొన్నలు తూ కం చేసి రెండు రోజులైనా సంచులు ఎత్తలేదు. దీం తో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో ధాన్యం, జొన్నలు తడిసి రైతులు నిండామునిగారు. తూకం చేసి లారీలకు ఎత్తకపోవడంతో తాము నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
పిడుగుపడి యువకుడు మృతి
దేవరకద్ర, మే 18 : పిడుగుపడి యువకుడు మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని గద్దెగూడెం గ్రామానికి చెందిన బత్తుల కృష్ణ య్య, సత్యమ్మ కుమారుడు దయకిరణ్ (22) జిల్లా కేంద్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం సెలవులు ఉండటంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు పశువులను మేపేందుకు గ్రామ సమీపానికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పిడుగుపడి దయకిరణ్ మృతిచెందాడు.