కాంగ్రెస్ పాలనలో రైతులు దగా పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయంలో కొర్రీలు పెడుతుండడంతో మోసపోతున్నారు. యాసంగి ధాన్యం విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో లెక్క ప్రకారం తూకాలు జరుగుతున్నా.. వడ్లు బాగాలేవని, సంచులు దించుకోమని, మరోసారి తూర్పార పట్టాలంటూ కొత్త పాట పాడుతుండడంతో కర్షకులు లబోదిబోమంటు న్నారు.
రైతుల పరిస్థితిని మిల్లర్లు అధికారులకు తెలియజేసినా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ముందు నుంచి ఇక్కడి మిల్లర్లతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కుమ్మక్కు కావడంతోనే మిల్లర్లు రూ.కోట్లాది ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన సంగతి విదితమే. ప్రస్తుతం ఈ సీజన్లోనైనా విక్రయాలు పారదర్శకంగా జరిపిస్తే తప్పా రైతులకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు.
– వనపర్తి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)
వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా సాగుతున్నది. ఓవైపు వరి కోతలు జోరుగా సాగుతుంటే.. మరో వైపు విక్రయాలు మాత్రం నల్లే రు మీద నడకలా జరుగుతున్నాయి. జిల్లాలో 481 కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించినా ఇంకా అన్ని సెంటర్లు తెరుచుకోలేదు. ప్రారంభమైన వాటిలో అత్యధిక భాగం కొనుగోళ్లు ప్రారంభించినవే ఉన్నాయి. ప్రారంభోత్సవాల్లో కేవలం కాంటా ను మాత్రమే ఏర్పాటు చేసి కొబ్బెరికాయలు కొట్టి మమ అనిపిస్తున్నారు.
అనంతరం తూకాల సంగతిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వారం రోజులైనా వివిధ కారణాల పేరుతో తూకాలను చేయడం లేదు. ప్రస్తుతం 95 కేంద్రాల ద్వారా 2,500 మెట్రి క్ టన్నులను కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో అకాల వర్షా లు కురుస్తున్న నేపథ్యంలో రైతన్నలు బావురుమంటున్నారు. ఏ సెంటర్లో చూసినా 10 లారీలు మొ దలుకొని 100 లారీల వడ్లు సిద్ధంగా ఉన్నాయి. తూ కాలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వనపర్తి మండలం కిష్టగిరి నుంచి శుక్రవారం ఉద యం పెబ్బేరు మండలం శేరుపల్లిలోని ఓ రైస్‌మిల్‌కు 730 బస్తాలతో లారీ వెళ్లింది. ఐకేపీ సెంటరు నుంచి కొనుగోలు చేయగా బుక్ కీపర్ లారీని అధికారులు సూచించిన మిల్లుకు పంపారు. వాహనం వెళ్లిన వెంటనే సంచులు మేం దింపుకోమని మిల్లరు చెప్పేయడంతో డ్రైవర్.. రైతులకు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సమాచారం ఇచ్చాడు. ఐకేపీ సెంట రు నిర్వాహకులు, రైతులు, రైస్ మిల్లుకు వెళ్లి ఆరా తీశారు. వడ్లలో తాలు ఉన్నదని, సంచికి 3 కిలోలు అదనంగా ఇవ్వాలని మిల్లరు డిమాండ్ పెట్టాడు. అలా ఇస్తేనే సంచులు దింపుకొంటానని, లేదంటే లారీ వడ్లు మొత్తం తూర్పార పట్టాలని షరతు విధించాడు. అన్నీ సక్రమంగా చూసే తూకాలు వేయడం జరిగిందని ఎంత చెప్పినా మిల్లరు మొండికేశాడు. చివరకు 730 బస్తాలకుగానూ 20 సంచులు తరగులెక్కన జమ చేసుకొని లారీ వడ్లను మిల్లరు దింపుకొన్నాడు. దీంతో రైతులు చేసేది లేక వెనుదిరిగారు.
కిష్టగిరి గ్రామం నుంచి వెళ్లిన లారీకి మిల్లరు బ్రేక్ చేయడంతో ఆ పక్కనే ఉన్న పెద్దగూడెం తండాలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. కిష్టగిరి.. పెద్దగూడెం తండాల్లో ఒకే ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. తండాలో 10 లారీల వడ్లు తూకాలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ కేవలం 142 సంచులు మాత్రమే తూకం వేసి నిలిపివేశారు. మిల్లరు సంచులను దింపుకోనందునా తూకాలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. నెల రోజుల నుంచి సెంటర్లో వడ్లు సిద్ధంగా ఉన్నాయని, ఒక రోజు.. ఒక గంట తూకం చేసి మళ్లీ నిలిపి వేస్తే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలంటూ గిరిజన రైతులు రూప్లానాయక్, నారాయణ, టీక్యా నాయక్, శంకరమ్మ లబోదిబోమంటున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో పకడ్బందీ చర్యలు చేపట్టలేదని పలువురు పెదవి విరుస్తున్నా రు. ఓ పక్క చివరి దశలో ఎండుతున్న చేల రైతుల బాధలుంటే.. మరోపక్క కోతలు కోసిన రైతులకు అధికారుల పుణ్యమా? అంటూ కష్టాలు తప్పడం లేదు. జిల్లా నుంచి భారీగా యాసంగి ధాన్యం రాబోతున్నది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు లేవన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రాల్లో జరుగుతున్న పనితీరు మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ పనితీరును అంచనా వేస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలోనూ రైతులకు కవర్ల పంపిణీ లేదు. కేవలం కమీషన్లపైనే అందరి దృష్టి.. కర్షకులను మాత్రం పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి.
చిన్నపాటి చినుకులకు సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయ్యే పరిస్థితి ఉన్నది. జిల్లా కేం ద్రంలోని మార్కెట్ యార్డు లో సైతం చినుకులు పడితే.. రై తులకు అవస్థలు ఎదురవుతున్నాయి. రైతులే సొంతంగా పను లు చేసుకోవాల్సి వస్తుంది. యార్డు లో నీళ్లు నిలిచినా రైతులే పారదోలుకొనే దుస్థితి. ఇక సెంటర్లలో నిర్వాహకులు ఏమాత్రం రైతుల గురించి పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నా రు. సంచులు తూకం వేసుకొనే వరకే తమ పని అన్నట్లుగా వ్యవహారం తయారైంది. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లు కొనుగోళ్లపై విమర్షలు వెలువెత్తుతున్నాయి.
అష్టకష్టాలు పడి పంట పండిస్తే.. అమ్ముకుందామంటే మరిన్ని కష్టాలు పెడుతున్నారు. 200 సంచుల వడ్లు తూకం వేసి లారీకి ఎత్తుకు పోయారు. చివరికి దింపుకోమని మిల్లరు బెదిరిస్తున్నాడు. రైతులమంతా మిల్లుకుపోతే మీ వడ్లు తీసుకెళ్లండంటూ ఆటలాడు కుంటున్నారు. ఇంతకు ముందు ఇలా లేదు. ఇప్పు డెందుకు రైతులను ఇబ్బందులు పెడుతున్నారో అర్థం కావడం లేదు. అధికారులు మిల్లర్లను పట్టించుకోవడం లేదు. నా బస్తాలకు అదనంగా 14 సంచుల వడ్లను తరుగు లెక్కన తీసుకుని మమ్మల్ని మిల్లరు దోపిడీ చేశారు. ఇదంతా ఎలా జరుగుతుందో ఇంతకు ముందు మాకు తెలిసేది కాదు. ఇప్పుడు ఇంత ఘోరంగా చేస్తున్నారు.
– కురుమయ్య, రైతు, కిష్టగిరి, వనపర్తి మండలం
నా వడ్లు 80 సంచులు తూకం ఎత్తుకెళ్లారు. తీరా మిల్లుకు వెళ్లిన తర్వాత సంచులు దింపుకోవడం లేదని.. మాకు ఫోన్ చేస్తే వెళ్లినం. తీరా అక్కడికి పోతే మిల్లరు లెక్క చేయడం లేదు. అదనంగా నాతో 2 సంచుల వడ్లను తరుగు కింద లెక్క కడితేనే దింపుకుంటానంటూ తెగేసి చెప్పాడు. మమ్మల్ని పట్టించుకునే దిక్కులేక బాధతో వెనుదిరిగి వచ్చాం. చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లుగా సర్కారు పనితీరు కనిపిస్తున్నది. రైతులను దారుణంగా దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే 40 కిలోల సంచి తూకానికి కిలో 300 గ్రాములు అదనంగా సెంటర్లోనే చేస్తున్నారు. ఇలా మళ్లీ మిల్లరు మమ్మల్ని తరుగు పేరుతో దోపిడీ చేస్తే మాకు మిగిలేదేమీ లేదు.
– కృష్ణయ్య, రైతు, కిష్టగిరి, వనపర్తి మండలం