వనపర్తి, జూన్ 14(నమస్తే తెలంగాణ) : జిల్లాలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నా రు. అయినా తూకం వేసిన బస్తాలు, తూకం వేయాల్సిన ధాన్యం కల్లాల్లో మగ్గుతూనే ఉంది. గతంలో కూడా ఇదే స్థాయిలో ప్రతి సీజన్లో ధాన్యం పండుతున్నా…ఇంతలా సమస్యలు ఎప్పుడు ఉత్పన్నం కాలే దు. ఏప్రిల్‌లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాగా, వానకాలం మృగశిరకార్తె సగం వరకు వచ్చిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగియకపోవడం విచారకరం.
కల్లాల వద్ద ఇప్పటికీ రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. రెండు నెలలు గడిచినప్పటికీ ఈ బాధలు తప్పడం లేదు. కల్లాలోని రైతుల సమస్య ఇలా ఉంటే, తూకం వేసిన బస్తాలు తరలించిన అనంతరం రైతుల నుంచి మిల్లర్లు తరుగు పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. క్వింటాకు 5 నుంచి 15 కిలోల వరకు రైతులతో అదనంగా తీసుకుంటున్నారు. హమాలీల సమస్య ఇతరత్ర ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. అధికారులకు తరుగు దోపిడీపై ఎంత చెప్పినా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీటితో పాటు లారీలు అందుబాటులోకి రానందునా రైతులే సొంతంగా ట్రాక్టర్లు పెట్టి బస్తాలను గోదాంలకు చేరవేశారు. ప్రారంభంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులన్ని ఇప్పటికి రైతులు ఎదుర్కొంటున్నారు. వానకాలం వచ్చినా రైతులుకు కల్లాల వద్ద పడిగాపులు తప్పడం లేదు.
ఇప్పటి వరకు జిల్లాలో 2లక్షల 30వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిన అంచనా ఉంది. జిల్లా వ్యాప్తంగా 417సెంటర్ల ద్వారా వీటి నిర్వహణ కొనసాగింది. ఇంచుమించు ఏప్రిల్ నుంచి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. రెండున్నర నెలల నుంచి రైతులు వరి ధాన్యం అమ్ముకునేందుకు నరకయాతన పడ్డారు. గతంలో ఎప్పుడు ఇంతటి దారుణ పరిస్థితులను చూడలేదని ఏరైతును కదలించినా బోరుమంటున్నారు. ప్రధానంగా గోదాంల సమస్య తీవ్రరూపం దాల్చగా ప్రస్తుతం గద్వాల జిల్లా మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు.
ఇంకా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉన్నట్లు అంచనా ఉంది. ప్రధానంగా గోపాల్పేట, రేవళ్లి, ఏదుల, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, పెబ్బేరు, శ్రీరంగాపురం, వనపర్తి ప్రాంతాల్లో ధాన్యం కుప్పలున్నాయి. వర్షాల తాకిడికి రైతులంతా ధాన్యం రాసులపై కవర్లు కప్పి ఉంచుకున్నారు. నెలరోజులకు పైగా కల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. గన్నీ బ్యాగులుంటే..హమాలీలు ఉండరు..ఈ రెండు సిద్ధంగా ఉంటే..లారీలు ఉం డవు.. ఇలా రైతులు కల్లాల్లో అవస్థలు పడుతున్నారు.
ఇదిలా ఉంటే, కల్లాల్లో తూకం చేయని ధాన్యంతోపాటు తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా అలాగే మగ్గుతున్నాయి. దాదాపు పది నుంచి 15 రోజులుగా కల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. ప్రక్రియ చివరి దశకు వచ్చినా ఇప్పటికి లారీల సమస్య రైతులను వెంటాడుతుంది. జిల్లాను 9 రూట్ల వారీగా కాంట్రాక్టర్లు టెండరు వేసినప్పటికీ అంతా తూచ్ అన్నట్లుగా ట్రాన్స్‌ఫోర్ట్ వ్యవస్థ కొనసాగుతున్నది. ఒక్కొక్క కాంట్రాక్టర్ 40 లారీలను మెయింటెన్ చేస్తున్నాడని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్న క్రమంలో వాస్తవ రూపం దాల్చనందునే ఈ అవస్థలు పడాల్సి వస్తుందని రైతాంగం ఆవేదన చెందుతున్నది.
ఇప్పటి వరకు మా గ్రామంలో 12లారీల వడ్లు తూకం వేసి గోదాంలకు తరలించారు. అయి తే, ఇంకా 5 లారీల వడ్లు తూకం చేయాల్సినవి ఉన్నాయి. కల్లాల్లో తూ కం వేసిన బస్తాలు మరో మూడు వేలు వరకు అలాగే ఉన్నాయి. మా లాంటి చిన్న గ్రామంలో కూడా ఇప్పటి వరకు వరి కొనుగోళ్లు పూర్తి చేయలేదంటే రైతుల పరిస్థితి ఎలా ఉందో చూ డండి. గతంలో ఎప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితులు రైతులకు లేవు. రైతుల సమస్యలను అధికారులు పట్టించుకోలేదు. ఈ యాసంగి సీజన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.
-శ్రీకాంత్ రెడ్డి, రైతు, సింగాయిపల్లి, ఏదుల మండలం