నాగర్‌కర్నూల్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు అద్భుతమైన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రైతులను ఎవరూ దగా చేయకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆలోచించి ధరణి పోర్టల్ తీసుకొచ్చిందన్నారు. పేరు మార్చుకోవాలన్నా.. భూమి అమ్మాలన్నా.. ఇతర ఏ అవసరమైనా రైతుకే అధికారం ఉంటుందని.. ఇందుకోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు.
ధరణి ద్వారా ఇప్పటికే 90శాతం భూ సమస్యలు తొలగిపోయాయని వెల్లడించారు. ధరణితో రైతులు బాగుండగా, కొందరు తెలివిలేని సన్యాసులు.. దళారులకు దందాగా పేరుగాంచిన కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో పడేయాలనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ధరణి వల్ల రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోళ్ల పైసలు రైతులకు నేరుగా అకౌంట్లో పడుతున్నాయని, గత ప్రభుత్వాల హయాంలో మధ్య దళారీలతో రైతులు ఎంతో నష్టపోయారని గుర్తుచేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ధరణికి శ్రీకారం చుట్టారన్నారు.
ధరణికి రైతులందరి మద్దతు ఉందన్నారు. ప్రాజెక్టు కడితే కేసు, కలెక్టరేట్ కడితే అవినీతి, మెడికల్ కాలేజీ కడితే కేసు ఇలా.. ప్రతి అభివృద్ధి పనిలో ప్రతిపక్షాలు అడ్డుపడుతూ తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని, ఇందులో భాగంగానే ఒకరివెంట మరొకరు అబద్ధాలతో రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు యాత్రలు చేపడుతున్నారని విమర్శించారు. తప్పు చేస్తే కోర్టుకు వెళ్లి నిరూపించాలని సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. లోపాయికారిగా రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. భట్టి యాత్రలో పది మంది కూడా వెంట లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మాయమాటలు నమ్మి మోసపోరాదని కోరారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత గృహలక్ష్మి ద్వారా రూ.3లక్షల పథకం, పోడు భూముల పథకం ప్రారంభిస్తారని చెప్పడం సంతోషకరమన్నారు.
సభ సక్సెస్‌పై ప్రజలకు కృతజ్ఞతలు..
సీఎం కేసీఆర్ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారని ప్రభుత్వ విప్ గువ్వల, ఎమ్మెల్యే మర్రి అన్నారు. సభ సక్సెస్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ మరింత ఉత్సాహంగా పనిచేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు బురద జల్లే పద్ధతి మానుకొని అభివృద్ధికి సహకరించాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం, నాయకులు సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు అమృతమ్మ, విజయమ్మ, నాయకులు మోతికుమార్, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.