ఊట్కూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యాహక్కు చట్టాన్ని( Right to Education Act) పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ (Raghuveer Yadav) డిమాండ్ చేశారు. శుక్రవారం ఊట్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు కేటాయించి ఉచితంగా విద్యను అందించాలని పేర్కొన్నారు.
25 శాతం విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి నిధుల రూపంలో కేటాయించాలని అన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాల యజమాన్యం ఇష్టారీతిన ఫీజులను రాబడుతుందని ఆరోపించారు. గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలను రద్దు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలపై జిల్లాలోని విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.