కల్వకుర్తి, ఫిబ్రవరి 20 : ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతుకు ఆగమాగం చేస్తున్నది. అన్నదాతకు ప్రయోజనకరంగా ఉంటుందని తీసుకొచ్చిన ఈ యాప్‌తో పడుతున్న బాధలు వర్ణణాతీతం. చదువుకున్న వారే ఇబ్బందులు పడుతుంటే.. చదువుకోని రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. దీంతో దేవుడిపై భారం వేయడం తప్పా మరో మార్గం కనిపించడం లేదు. తిరుమల వెంకన్న దర్శనం కోసం సైట్లో టీటీడీ టికెట్లు విడుదల చేస్తే 10 నుంచి 20 నిమిషాల పాటు అందుబాటులో ఉంటాయి. కానీ ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా కోసం ఎప్పుడు చూసినా నోస్టాకే దర్శనమిస్తుంది.
ఎప్పుడు స్టాక్ వస్తుందో.. ఎప్పుడు అయిపోతుందో? రైతులకు అర్థం కాని పరిస్థితి. దుకాణానికి 400 బస్తాలు వచ్చిందని, ఫలానా టైంలో రిలీజ్ చేస్తారని రైతులకు సమాచారం వచ్చిన వెంటనే ఆ సమయం ప్రకారం యాప్ తెరిస్తే 2 సెకన్లలో బస్తాలన్నీ మాయమవుతాయి. వెంటనే నోస్టాక్ అని దర్శనమిస్తుంది. గతంలో దుకాణాల వద్ద పడిగాపులు గాస్తే ఒకటో, రెండో బస్తాలు దక్కేవని.. యాప్ వచ్చాక యూరియా అందని ద్రాక్షగా మారిందరి రైతులు వాపోతున్నారు. పలు చోట్ల కర్షకులు ఆందోళనకు దిగుతున్నా.. అధికారులు స్పందించని పరిస్థితి కనిపిస్తున్నది. అయితే సకాలంలో పంటలకు అందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 3,94,567 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఇందులో రైతులు 1,40,064 వేల ఎకరాల్లో వరి, 1,35,348 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1,19లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తారని వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. యాసంగిలో సాగు చేసిన పంటలకు 56.607 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి ఇండెంట్ పంపించా రు.
ఇప్పటి వరకు జిల్లాకు 33,555 మెట్రిక్ టన్నుల యూ రియా వచ్చిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇంకా 23వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయాధికారుల లెక్కలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు సగానికి పైగా యూ రియా రైతుల వద్దకు చేరితే.. యూరియా కోసం రైతులు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారన్నది శేష ప్రశ్న. అధికారుల లెక్కల ప్రకారం ఇంత వరకు యాప్‌ల ద్వారా పంపిణీ చేసిన యూరియా ఎక్కడకు చేరిందనే అనుమానాలు సహజం గానే ఉత్పన్నమవుతాయి.
చాలా మంది రైతులకు ఫర్టిలైజర్ యాప్ గురించి స్పష్టమైన అవగాహన లేదు. అవగాహన ఉన్నా..చాలా మంది రైతులకు డబ్బా ఫోన్లు మాత్రమే ఉన్నాయి. ఫర్టిలైజర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాంటే.. స్మార్ట్ ఫోన్ అవసరం. గ్రామా ల్లో ఉన్న చాలా మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండదు. యాప్ డౌన్లోడ్ చేసుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని యూరియా కోసం యాప్‌ను ద్వారా ప్రయత్నిస్తే.. ఎప్పుడు చూసినా నోస్టాక్ దర్శనమిస్తున్నది.
ఎప్పుడన్నా.. యూరియా స్టాక్ రిలీజ్ చేశారని సమాచారం వస్తే.. వెంటనే యాప్ తెరిచి చూస్తే ఇంకేముంది.. యథావిధిగా నోస్టాక్ అని దర్శనమిస్తున్నది. యాప్ లేక ముందు ఫర్టిలైజర్ దుకాణాల ముందు పడిగాపులు కాస్తే.. ఒకటో రెండో బస్తాల యూరియా లభించేవి.. ఇప్పుడు యాప్ పుణ్యమా అని యూరియా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు అయిపొతుందో తెలియని పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాల నుంచి యూరియా కష్టాలు వస్తున్నాయి. యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల ముందు గుమిగూడటం, లైన్లో ఉండడం, యూరియా లభించకపోతే రైతులు ధర్నాలకు దిగటం, రాస్తారోకోలు చేయడం సహజంగా ఉండేది. రైతుల ధర్నాలు, ఆందోళనల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి వచ్చేది. వీటన్నింటికీ ఫుల్‌స్టాఫ్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్‌ను తీసుకువచ్చింది. యాప్ ద్వారా యూరియాను బుకింగ్ చేసుకోవాలి.. బుకింగ్ చేసుకున్న దుకాణంలో సంబంధిత పత్రాలను సమర్పించి యూరియా తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.
దీని ద్వారా యూరియా అక్రమార్కులకు చేరదని ప్రభుత్వ వాదన. యూరియా సమృద్ధిగా ఉంటే.. ఇంతకన్న మంచి ఉద్దేశం మరేది ఉండదు. కాకపోతే యూరియా సకాలంలో రైతులందరికీ అందకపోతేనే యాప్‌తో ఎవరికి లాభమన్నది ప్రశ్న. గతంలో దుకాణాల వద్దకు వచ్చిన రైతులకు యారియా అందకపోతే.. రైతులందరు గుమిగూడి ఆందోళన కార్యక్రమాలు చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి రావద్దనే ఉద్దేశంతోనే ప్రభు త్వం యాప్ తీసుకువచ్చిందని.. యాప్‌లో యూరియా బుక్ అయిన రైతులు మాత్రమే పర్టిలైజర్ దుకాణల వద్దకు వస్తారని.. ఆందోళనలకు ఆస్కారం ఉండదనే ముందు చూ పుతో ప్రభుత్వం యాప్ తీసుకువచ్చిందని రైతు సంఘాల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు.. మండలానికి ఫర్టిలైజర్ కోటా విడుదల విషయం కొంతమందికే తెలియడం.. వారు మాత్రమే ఆ సమయానికి యాప్ తెరిచి యూరియా బుకింగ్ చేస్తున్నారనే ఆరోపణలను రైతులు వినిపిస్తున్నారు. గత వారం కిందటి వరకు ఏఈవోలు, ఏవోలు ఫలానా తేదీన ఫలానా దుకాణానికి ఇంత కోటా యూరియా వస్తుందని, ఫలానా టైంలో కోటా విడుదల చేస్తారని గ్రామాల వాట్సాప్ గ్రూప్‌లో, సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసేవారు.
ఏమైందో ఏమో గాని గత వారం నుంచి ఎవరు..ఎవరికి సమాచారం ఇవ్వడం లేదు. యూరియా కోటా వచ్చినా దుకాణం లేదా సొసైటీ యజమాని తనకు సంబంధించిన వారికి, లేదా తన ఆసాములకు సమాచారం ఇవ్వడంతో వారు యూరియా బుక్ చేస్తుకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అవసరం లేకున్నా యూరియా బుక్ చేసుకున్న వారు సదరు యూరియాను బ్లాక్ మార్కెట్లో రూ.6 వందలకు బస్తాను విక్రయిస్తున్నారని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా నాగర్‌కర్నూల్. నల్లమ ల్ల బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి సొం త జిల్ల్లాలో నల్లమల్ల బిడ్డలు యూరియా కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంతకు యూరియా లభిస్తుందా.. లేక యూరియా వేయకుండానే పంటలను గాలికొదిలేయాలా అని నల్లమల్ల రైతు బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వారు ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు అందరూ అధికార పార్టీకి చెందిన వారే..
అయినా యూరియా కష్టాల గురించి ఎవరు మాట్లాడరు. ఎవరు పట్టించుకోరు. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానం కోసం, రాజకీయ లబ్ధికోసం, ఇతర పార్టీల అభ్యర్థులను లాక్కొవడం వంటి కార్యక్రమాల్లో శ్రమించిన దాంట్లో పావువంతు శ్రమించినా యూరియా కష్టాలు తొలగిపోతాయని రైతు సంఘాల నాయకులు సెటైర్లు విసురుతున్నారు. మిగతా జిల్లాల్లో అంతో ఇంతో యూరియా లభ్యమవుతున్నా.. నాగర్‌కర్నూల్ జిల్లాలో మాత్రం యూరియా మాత్రం నల్లపూస అయిందని రైతులు వాపోతున్నారు.
పెద్దకొత్తపల్లి, ఫిబ్రవరి 20 : రైతులకు యూరియాను యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో శుక్రవారం యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయాన్ని రైతులు దిగ్భందించారు. ప్రభుత్వం రైతులను మోసం చేసేందుకు యాప్‌లో యూరియాను బక్ చేసుకోవాలని టోకరా పెడుతోందని రైతులు ఆరోపించారు. ఉదయం 10 గంటలకు యూరియా అందుబాటులో ఉందని యాప్‌లో బుక్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారని యాప్ ఓపెన్ చేసిన పది నిమిషాలలోనే యూరియా అయిపోయినట్లు చూపించిందని రైతులు పేర్కొంటున్నారు.
దీంతో యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న పది గ్రామాలకు చెందిన వంద మంది రైతులు మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయానికికి తరలివచ్చి దిగ్బంధించారు. యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతి ద్వారా యూరియాను రైతులకు ఇవ్వాలని వ్యవసాయ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యాప్ ద్వారా యూరియాను బక్ చేసుకునేందుకు ప్రయత్నించిన బుక్ కావడం లేదని రైతులు ఆరోపిం చారు.
యాప్‌లో యూరియా స్టాక్ రెండు నిమిషాలు కూడా ఉండడం లేదని రైతులు వాపోయారు. అందుకే యాప్ ద్వారా యూరియా పంపిణీ చేయకుండా సొసైటీ ద్వారానే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. సోసైటీ కార్యాలయం వద్ద రైతుల ధర్నా ఉద్రిక్తతకు దారి తీయడంతో ఎస్సై సతీశ్ పీఏసీసీఎస్కు చేరుకొని రైతులకు సర్దిచెప్పారు. కార్యక్రమంలో తిరుమలేశ్, రమేశ్‌రెడ్డి, బెట్టరి నాగరాజుతోపాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
యూరియా కోసం యాప్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే నోస్టాక్ అంటూ డిస్ప్లే వస్తుంది. యూరియా కోసం గత పది రోజుల నుంచి రోజు దుకాణాల వద్దకు వచ్చి పోతున్నారు. ఫలానా దుకాణానికి ఫలానా రోజులో వస్తుందని చెబుత్నారు. తీరా ఆ సమయంలో యాప్ ఓపెన్ చేస్తే క్షణాల్లో యూరియా అయిపోతుంది. యూరియా బుక్ కావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
యూరియా సమృద్ధిగా దుకాణాలకు సరఫరా చేస్తే ఈ పరిస్థితి రాదు. అంతంత మాత్రంగానే యూరియా సరఫరా చేస్తుండడంతో ఈ పరిస్థితి దాపురించింది. బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్కరోజు కూడా యూరియా కోసం ఎదురు చూడలేదు. ఇప్పుడేమో పరిస్థితి దినదిన గండగా మారింది. యారియూ లభించక పంటలు దిడుబడి రాకపోతే…ఈ దుస్థితికి ముఖ్యమంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి
– మురళీధర్‌రెడ్డి, రైతు, వంగూరు
నాకు యాప్ గురించి తెలియదు.. నాకు రెండు బస్తాల యూరియా కావాలి. వరి నాటి దాదాపు 30 రోజులకు పైగా అయింది. యూరియా చల్లాల్సిన దశ వచ్చింది. గత వారం రోజులుగా రెండు బస్తాల యూరియా కోసం దుకాణాల వద్దకు వస్తున్నాను. యాప్‌లో బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. నా వద్ద డబ్బా ఫోన్ ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. యాప్ ద్వారా యూరియా బుక్ చేయమని ఎవరినైన అడుదాం అంటే.. యూరియా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలియడం లేదట. యాప్ తీసివేసి నేరుగా యూరియా ఇస్తే.. రెండు రోజులైన దుకాణాల వద్ద పడిగాపులు గాసైనా యూరియాను తీసుకుంటాం.
– హరీశ్, రైతు మార్చాల, కల్వకుర్తి మండలం