హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుల ఆగడాలకు దళిత యువకుడు కర్ల రాజేశ్ బలి అయ్యాడని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ చెప్పారు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లనే లాకప్‌డెత్ చోటుచేసుకుందని తెలిపారు. కర్ల రాజేశ్ లాకప్‌డెత్ అంశంపై ఆయన శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ ‘సీఎంఆర్ఎఫ్ చెక్ విషయంలో ఎవరో రాజకీయ నేతల పేర్లు చెప్పించాలనే దురుద్దేశంతోనే కర్ల రాజేశ్‌ను చిత్రహింసలు పెట్టారు. కోర్టులో హాజరుపర్చేందుకు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ నేరుగా నరాలకు ఇచ్చారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు మా దర్యాప్తులో తేలింది. పోలీసులు కొట్టిన దెబ్బలకు దవాఖానలో చేరిన మరుసటి రోజే చనిపోయాడు. మొత్తానికి కోదాడ పోలీసుల ఆగడాలకే కర్ల రాజేశ్ బలి అయ్యాడు’ అని పేర్కొన్నారు. రాజేశ్ లాకప్‌డెత్‌ను సుమోటోగా జాతీయ ఎస్సీ కమిషన్ స్వీకరించినట్టు వడ్డేపల్లి రాంచందర్ చెప్పారు.
రాజేశ్ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూడెకరాల భూమి, ఇల్లు, తల్లికి పెన్షన్ ఇవ్వాలని ఆదేశించామని రాంచందర్ తెలిపారు. మృతుడి కుటుంబానికి జాతీయ ఎస్సీ కమిషన్ వెన్నుదన్నుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పోలీసుల ఆగడాలు బాగా ఎక్కువయ్యాయని, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలను బేఖాతారు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
లాకప్‌డెత్ విషయంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను ఆదేశిస్తే అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని రాంచందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యాకే స్థానిక ఎస్సై, సీఐలపై కేసులు నమోదు చేశారని, ఆఘమేఘాలపై సీఐని సస్పెండ్ చేశారే కానీ.. ఎస్సైని నేటికి సస్పెండ్ చేయలేదని మండిపడ్డారు. కొందరి అండదండలతో సస్పెన్షన్ నుంచి తప్పించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సైని వారంలోపు సస్పెండ్ చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.