మహబూబ్ నగర్ : బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం పలు డివిజన్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా మెట్టుగడ్డ మార్కెట్ ను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ పట్టణంలో నిర్మించిన టౌన్ హాల్‌ను ఎందుకు ఓపెన్ చేయడం లేదని, వెయ్యి పడకల ఆసుపత్రిని ఎందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న హరిత హోటల్ ఎందుకు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. శిల్పారామం, ట్యాంక్ బండ్ పరిస్థితి ఏమైందని, మైనారిటీ గురుకులాలు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.
మన్యకాండ రోప్ వేను ప్రారంభించకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో మంచి నీళ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులకు చేత కావడం లేదని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.