– ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్
రామగిరి, ఫిబ్రవరి 05 : రాష్ట్రంలో ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పురపాలిక పరిధిలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం నల్లగొండలోని డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. పార్టీలను చూసి కాకుండా మీకు స్థానికంగా అందుబాటులో ఉండేవారిని, సమస్యలు పరిష్కరించే వారిని ఎన్నుకోవాలన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచి నీరు, పారిశుధ్యం, విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో, అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోవాలని తెలిపారు.
ఓటు విలువైనది అని చెబుతూ దానిని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయడం, ఇష్టం లేకుంటే నోటా కు ఓటు వేయాలన్నారు. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకుండా ఉండొద్దన్నారు. అధికారులు ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటునందున ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. మున్సిపాలిటీలలో మహిళా ఓటర్లు, యువత ఓట్లు ఎక్కువ ఉన్నాయని వివరిస్తూ అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు. పలు మున్సిపాలిటీలలో ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డుల్లో ప్రజలు ఎన్నికలు నిర్వహించాలని రోడ్డు మీదకు రావడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా, ఓట్ల ద్వారా అభ్యర్థిని ఎన్నుకుంటామని తెలిపారు. విద్యావంతులు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ఓటరు గెలుపొందాలన్నారు. ఈ సమావేశంలో జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుష్యర్ల సత్యనారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సుధారాణి, దేవరగట్టు నాగలక్ష్మీరెడ్డి, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సలహాదారు కోట్ల రామలింగయ్య, ప్రొఫెసర్ కోటయ్య, నేలపట్ల సత్యనారాయణ, కొంపల్లి రమేష్, మర్రి గణేష్, తలారి ఉపేందర్, శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు.