Abu Salem : 1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, మాఫియా డాన్‌గా పిలిచే అబూసలేంకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడు దాఖలు చేసిన ఎమర్జెన్సీ పెరోల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. రూ.17 లక్షలు చెల్లిస్తేనే పెరోల్ మంజూరుచేస్తామని చెప్పింది. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూ సలేంకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడు ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్ రోడ్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
2017లో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ఇన్నేళ్లుగా జైలులో ఉంటున్న అతడు తన సోదరుడు మరణించినందున స్వగ్రామం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. యూపీలోని అజాంఘర్ జిల్లాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు అత్యవసర పెరోల్ ఇవ్వాలని బాంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు.. రూ.17 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కడితేనే పెరోల్ మంజూరు చేస్తామని చెప్పింది. అబూ సలేం ఈ డబ్బులు కట్టలేకపోవడంతో బాంబే హైకోర్టు అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ శ్యామ్ చందక్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. అంత డబ్బు చెల్లించలేమని, కొంత మినహాయింపు ఇవ్వాలని అబూ సలేం తరఫు న్యాయవాదులు కోరినప్పటికీ కోర్టు దీనిని పరిగణనలోకి తీసుకోలేదు.
డీ కంపెనీని నడిపిన దావూద్ ఇబ్రహీం అనుచరుడైన అబూ సలేం 1993లో జరిగిన ముంబై సీరియల్ బ్లాస్ట్ ఘటనకు ప్రధాన కారకుడిగా తేలింది. ఈ పేలుడులో 257 మంది మరణించగా, 1,400 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిగే సమయానికే అతడు పోర్చుగల్ పారిపోయి దాక్కున్నాడు. చివరకు ప్రభుత్వం చాలా శ్రమించి.. పోర్చుగల్ ప్రభుత్వాన్ని ఒప్పించి అతడిని 2005లో ఇండియాకు రప్పించింది. అనంతరం పలు విచారణల అనంతరం అబూ సలేంను దోషిగా తేలుస్తూ కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.